నకిరేకల్, జూన్ 19 : దేశంలో ఏ ప్రజాప్రతినిధి గానీ, సీఎంలు గానీ దేవుళ్లపై ప్రమాణం చేయలేదని, కేవలం రేవంత్‌రెడ్డి ఒక్కడే దేవుళ్లపై ఒట్లు పెట్టి వారిని కూడా మోసం చేశాడని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎద్దేవా చేశారు. నకిరేకల్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఎక్కడ పోయిందని విమర్శించారు. ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఉన్న రైతుబంధు రూ.15వేలు చేస్తానని ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 6 నెలలలైనా ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు.
70శాతం మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రూ.99వేల వరకు రుణమాఫీ చేశామని, మరో 30శాతం మందికి మాత్రమే రుణమాఫీ మిగిలిందని, వారికి మాఫీ చేసేందుకు మంత్రులతో, అధికారులతో పత్రికల్లో ఆగస్టు లోపు మాఫీ చేస్తామని రాయించడం తప్ప ఆచరణలో లేదన్నారు. అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, హోంగార్డులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్సే అన్నారు. రైతు రాజులాగా బతకాలని సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
24 గంటల కరెంటుతోపాటు ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసే ప్రక్రియ చేపట్టి వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఘనత ప్రపంచంలో కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టకుండా ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై ఏ విధంగా కేసులు పెట్టాలి, జైలుకు ఎలా పంపాలనే ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చే పరిస్థితి లేదని, 100కు డయల్ చేసినా ఫలితం లేదని, ఏ ఊరు నుంచి అయితే ఫోన్ వస్తుందో.. ఆ ఊరి కాంగ్రెస్ లీడర్‌ను అడిగి రావాలా? వద్దా ? అన్న ఆలోచనలో పోలీస్ యంత్రాంగం ఉందన్నారు.
పోలీస్ స్టేషన్ బయటనే ఫొటోలు తీసుకుని ఏ పార్టీ అని అడిగి లోపలికి రానిచ్చే పరిస్థితి నకిరేకల్‌లో ఉందన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి న్యాయాన్ని అన్యాయం చేయొద్దన్నారు. నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఏ విధమైన అరాచకాలు సాగుతున్నాయో చూడాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నకిరేకల్, కేతేపల్లి మండలాల అధ్యక్షుడు నవీన్‌రావు, వెంకట్‌రెడ్డి, నాయకులు నడికుడి వెంకటేశ్వర్లు, రాచకొండ వెంకన్న, గుర్రం గణేశ్, దైద పరమేశం, కౌన్సిలర్ రాచకొండ సునీల్ పాల్గొన్నారు.