నకిరేకల్, మే 14 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నకిరేకల్నియోజకవర్గంలోని ఆయా బూత్‌ల వద్ద బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీకి చెందిన కొంతమంది దాడులు చేశారని, బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే బాధిత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నల్లగొండ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన పోలీసు అధికారులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ బూత్‌ల వద్ద ఎన్నికలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కక్షపూరితంగా దాడులు చేసి గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు కావాలని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు.
బాధితులు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీ రాచకొండ వెంకన్న తదితరులు ఉన్నారు.