నకిరేకల్, నవంబర్ 20 : వరంగల్ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు పశువుల కాపరి కంటే ఘోరంగా ఉందని, ఆయన ఓ రోత ముఖ్యమంత్రి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రుణమాఫీ సంబురాలకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరూ రాలేకపోయారని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏం ఉద్ధరించావని విజయోత్సవ సభలు చేస్తున్నావ్? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిది ఫెయిల్యూర్ ప్రభుత్వమన్నారు. తప్పుడు లెక్కలు చూపించుకుంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు. రేవంత్‌రెడ్డి అదానీ, అంబానీలతో చేతులు కలిపి పేదల ప్రజల భూములను లాక్కొని కెమికల్ ఫ్యాక్టరీలకు కట్టబెడుతున్నాడని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటీని పూర్తి చేశారని, అందుకే ప్రజలు విజయోత్సవాలు చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, దమ్ముంటే ఇచ్చిన హామీలన్నింటీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఫార్మా పేరుతో రైతులపై అక్రమ కేసులు పెడుతున్నందుకు చేస్తున్నారా? రైతు రుణమాఫీ ఎగ్గొటినందుకా? పింఛన్లు పెంచుతామని చెప్పి తప్పినందుకా? లగచర్లలో ప్రజలను అవస్థలు పెడుతున్నందుకా? ఎందుకు విజయోత్సవ సభలు చేస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసిఆర్‌ను తిట్టడం మాని హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నకిరేకల్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మాద నగేశ్‌గౌడ్, గొర్ల వీరయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, పెండెం సదానందం, యానాల లింగారెడ్డి, రాచకొండ వెంకన్న, దైద పరమేశం, పల్లె విజయ్, గుర్రం గణేశ్, దైద అఖిల్, తదితరులు పాల్గొన్నారు.