కోదాడ, జూలై 12 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించిన మహానేత కేసీఆర్‌ను ఉద్యమ నేతలు, హరీష్‌రావు కేటీఆర్‌పై జగుప్సాకర వ్యాఖ్యలు చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కోదాడ ప్రధాన రహదారిపై రేవంత్ అనుచిత వ్యాఖలను నిరసిస్తూ వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, రేవంత్ హఠావో అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్లోని ముగ్గురి నేతలను కోసి ఆ రక్తంతో పంటలను తడపాలని హేయంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి నాలుక కోసి కారం పెడితేనే పాప పరిహారం అవుతుందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అథోగతి పాలై, కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇదేమిటని ప్రశ్నించిన ప్రతి వర్గాన్ని వీధి రౌడీలా బెదిరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
వర్షాభావంతో సాగునీరు అందని పరిస్థితిలో అన్నదాతలు గగ్గోలు పెడుతుంటే కాళేశ్వరం నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులపై కక్షపెట్టి సాగునీరు అందించని సైకో ముఖ్యమత్రి అని బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. కాళేశ్వరం నీటిని విడుదల చేయవచ్చని విశ్రాంత ఇంజనీర్ల సంఘం బాధ్యులు స్పష్టం చేస్తే వారిని బొక్కలో వేయాలని, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అవాకులు, చవాకులు పేలుతున్న రేవంత్‌కు మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతులకు సాగునీరుందించి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తే నేడు రైతుల ద్రోహి రేవంత్‌రెడ్డి కళ్లెదుటే 9 టీఎంసీల నీటిని సముద్రం పాలు చెస్తున్నాడని ఇంతకన్నా దుర్మర్గం ఏమన్నా ఉంటుందా అని మండిపడ్డారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖలు చేసిన రేవంత్ క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు కోదాడ నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ధర్నాలో పట్టణ, మండల బాధ్యులు రమేష్, సుంకర అజయ్ కుమార్, ప్రదీప్, శివాజీ, జానకి రామాచారి, తాళ్లూరు శ్రీను, నర్సిరెడ్డి, ఆంజనేయులు, శీల సైదులు, ఏలూరు వెంకటేశ్వర్లు, యుగంధర్‌రెడ్డి, అప్పారావు, ఎస్కే నయీమ్, చీమ నరేష్, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, కరీముల్లా బాబా, అబ్బు ఉపేందర్‌గౌడ్ చలిగంటి వెంకట్, భాగ్యమ్మతో పాటు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.