– మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన
కోదాడ, ఆగస్టు 26 : కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే ఉన్నత వైద్యశాలలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన ఎంతో విషాదకరమని, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోదాడ మండలం దొరకుంట శివారులో రోడ్డుపై ఆగిఉన్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.

బస్సు ప్రమాద క్షతగాత్రులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శ