సూర్యాపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలు తీవ్రంగా అసహించుకునే పార్టీలోకి మారి పరువు పోగొట్టుకుంటూ.. పదవి ఉంటుందో పోతుందోననే భయంతో నోటికొచ్చిన అబద్ధాలతో దింపుడు కల్లం ఆశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వారిని ఎవరూ కాపాడలేరు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కుంటి సాకులపై ఆయన సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఘాటుగా స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నారు. స్పీకర్‌కు ఇచ్చిన సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. మరోపక్క రేవంత్‌ను కలిసింది కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే అంటే ప్రజలు అంత అజ్ఞానులు కారన్నారు.
రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు.. జాతీయ జెండా అని చెప్పడంపై జాతీయ జెండాను అవహేళన చేయడం.. అవమానించడమే అన్నారు. పార్టీ మారకపోతే బీఆర్ఎస్ కార్యాలయానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌పై నమ్మకమున్నప్పడు నోటీసులు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకే రావాలి కదా’ అని అన్నారు. ‘నోట్ల కట్టలతో దొరికినా.. మరేదైనా దొంగతనం చేసినా.. ఎప్పటికైనా తప్పించుకోలేరు. శిక్ష అనుభవించక తప్పదు.
ఇటీవల రేవంత్‌రెడ్డి ఇంటికెందుకు వెళ్లారో సమాధానం చెబుతారా?’ అని ప్రశ్నించారు. ఎవరో కాపాడుతారనుకుంటే అది వాళ్ల తెలివి తక్కువ తనమే అవుతుందని. రేవంతే కాదు వీళ్లను ఇంకా ఎవరూ కాపాడలేరని అన్నారు. ‘వాళ్లను డిస్క్వాలిఫై చేయడం ఖాయం. ఉప ఎన్నికలు రావడం తథ్యం. ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా బొండపెడతారు’ అని అన్నారు. చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, మోసగాళ్లను ముఖ్యమంత్రి కాదు కదా ఎవరూ కాపాడలేరని ఆయన అన్నారు.