సూర్యాపేట టౌన్ : 2025 కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికి ఒకరు మంచిని పంచుతూ ఐక్యతను పెంచుకోవాలన్నారు. కుటుం బ సభ్యులతో వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. 2024 అంతా శూన్యమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలే మిగిల్చిందని పేర్కొన్నారు.
2025లోనైనా కనువిప్పు కలిగి అభివృద్ధికి అడుగులు పడాలని ఆశిద్దామన్నారు. మార్పు మార్పు అన్న రేవంత్ ప్రభుత్వం పేర్ల మార్పుకే పరిమితమైందని, పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అనే పదం ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర అని తెలిపారు.
సూర్యాపేట అభివృద్ధికి నిధులు బంద్ అయ్యాయని, ఐటీ హబ్ అడ్రస్ మాయమైందని, హామీల ఊసే కరువైందని అన్నారు. అర్థం లేని ఆరోపణలు, పేర్ల మార్పులతోనే ఏడాది గడిచిందని, ప్రజలంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇక నుంచి అయినా ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని సర్కారుకు సూచించారు. 2025 అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండాలని ఆకాక్షించారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పేరుతో నిర్వహించిన వేడుకలకు జిల్లా ప్రజలు భారీగానే ఖర్చు చేసినట్లు అంచనా. సుమారు రూ.30 కోట్ల వరకు మద్యం, మాంసం, కేక్‌లు, ఇతరత్రాలతో కలిపి ఖర్చు పెట్టవచ్చని తెలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో సాధారణ రోజుల్లో ప్రతి వైన్ షాపు సరాసరి రూ. లక్ష నుంచి లక్షన్నర మధ్య అమ్మకాలు జరుపుతుంది. కానీ కొత్త ఏడాది సందర్భంగా ఒక్కో కౌంటర్ రెట్టింపు అయినట్లు సమాచారం. ప్రతి దుకాణంలోనూ సగటున రూ. 3 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ఈ లెక్కన జిల్లాలో ఏడాది చివరి రోజుల్లో కలిపి మొత్తం సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మకాలు జరుగవచ్చని తెలుస్తుంది.
ఇక మటన్, చికెన్ దుకాణాల వద్ద కూడా రష్ కనిపించింది. ఇక్కడ కూడా సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరిగింది. సాధారణంగా మధ్య రకం మాంసం దుకాణం ప్రతిరోజూ చేసే వ్యాపారం రూ. 5 నుంచి 8 వేలు. కానీ ఈసారి డిసెంబర్ 31, జనవరి 1న ఒక్కో దుకాణం కనీసం రూ.30 వేల వరకు వ్యాపారం చేసింది. జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా చికెన్, మటన్, ఫిష్ విక్రయ కేంద్రాలు ఉండగా.. అంతటా అదనపు గిరాకీ కనిపించింది. ఇక మరో ప్రధాన వ్యాపారమైన బేకరీల విషయానికి వస్తే ఇక్కడా కేక్‌ల కోసం భారీగానే ఖర్చు చేశారు.
గతంలో పోలిస్తే బేకరీ కేక్‌ల కోసం కొంత డిమాండ్ తగ్గినా సాధారణ రోజులతో పోలిస్తే అదనపు బిజినెస్ భారీగా జరిగింది. సాధారణ రోజుల్లో పదిపన్నెండు వేల రూపాయల కేక్ వ్యాపారం మాత్రమే జరిపే ప్రధాన బేకరీలు… కొత్త సంవత్సరం సందర్భంగా రూ.లక్షకు పైగానే అమ్మకాలు జరిపినట్లు అంచనా. ఎప్పటిలాగే బేకరీ యజమానుల్లో ఎక్కువ మంది ఈ సారి కూడా ప్రత్యేక ఆఫర్లు పెట్టి మరీ కస్టమర్లను ఆకర్షించారు. స్వీటు దుకాణాల్లోనూ రద్దీ కనిపించింది. మంగళవారంతో పాటు బుధవారం కొత్త సంవత్సరం రోజు కూడా విందులు, వినోదాలు కొనసాగనున్నాయి.