బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 29 : పేదలకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్య పడొద్దని.. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా సూర్యాపేట జిల్లాకు రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం సూర్యాపేటలోని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు.
వందలాది కుటుంబాలు రావడంతో వారందరినీ ఒక్క దగ్గర కూర్చోబెట్టి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి భరోసా కల్పించారు.భయాందోళనలు వద్దని, కొట్లాడుదామని.. ప్రజల జీవితాలతో ఆడుకుంటామంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, తన ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరుగనివ్వనని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాలు మరిచిన కాంగ్రెస్‌కు ప్రజల్లో తిరుగుబాటు తప్పదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కన్నీళ్లు పెట్టించడం మానుకోవాలని తెలిపారు.
ఎప్పుడేం జరుగుతుందోనని నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్న తమ వద్దకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చి ధైర్యం చెప్పడంతో భయాందోళనలు వీడి ప్రశాంతంగా ఉన్నామని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాలు తెలుసుకొని అండగా ఉంటామన్నారని, ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్ తాహేర్‌పాషా, నాయకులు అంగిరేకుల నాగార్జున, బత్తుల రమేశ్ పాల్గొన్నారు.