మిర్యాలగూడ, సెప్టెంబర్ 24 : తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాలన పడకేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని తిరోగమనంలో నడుపుతున్నదని, ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.
ఉన్న వ్యవస్థలను కూడా సరిగ్గా నడపలేకపోతుందన్నదని విమర్శించారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను నాశనం చేసిందని, కనీసం రైతుల సాగు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అవగాహన లేదని దద్దమ్మల్లా ఉన్నారన్నారు. వారికి అక్రమ సంపాదన, బ్లాక్ మెయిలింగ్ తప్ప పరిపాలన మీద సోయిలేదన్నారు. జిల్లా మంత్రుల నిర్లక్ష్యంతో సాగర్ నీళ్లన్నీ సముద్రం పాలు అవుతున్నాయన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులు ఈ 9 నెలల్లో పునరావృతం అయ్యాయని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతో నాగార్జునసాగర్ కాల్వకు గండి పడిందన్నారు. ఎడమకాల్వకు గండి పడితే బీఆర్ఎస్ హయాంలో వారం రోజుల్లో నీటి సరఫరాను పునరుద్ధరించడాన్ని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ పాలనలో గండ్లు పూడ్చడానికి 20 రోజులకు పైగా సమయం పట్టిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన జీఓ నెం.33తో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. పదేండ్లలో వెయ్యికి పైగా గురుకులాలను, 30కిపైగా మెడికల్ కళాశాలలను కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పుడు రైతులకు రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదు.. పండించిన ధాన్యానికి రూ.500 బోనస్పైగా స్పష్టత లేదని విమర్శించారు.
కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లా మంత్రులు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. వారికి మద్దతు ఇస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లాను దేశంలోనే అగ్రభాగాన నిలిపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లిందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అన్నదాత పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, హాతీరాంనాయక్, బాలాజీనాయక్, చౌగాని భిక్షంగౌడ్, సోము సైదిరెడ్డి, పూనాటి లక్ష్మీనారాయణ, ఎండీ షోయబ్ పాల్గొన్నారు.