సూర్యాపేట, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు… ఉద్యమాన్ని నిలబెట్టేందుకు ఎన్ని సార్లు మోసాలకు గురయ్యారు… ఎన్ని ద్రోహాలు జరిగాయి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఎలా సాధించారు అనే విషయాలను నేటి యువతరానికి తెలియజేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మనందరిపైనా ఉంది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ దీక్షకు కూర్చున్న రోజు నవంబర్ 29 కాగా అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలకమైన రోజని తెలిపారు.
ఈ నెల 29న చేపట్టే దీక్షా దివస్ విజయవంతం కోసం మంగళవారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పద్నాలుగేండ్లు బొబ్బిలిలా ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అదే ఉద్యమ స్ఫూర్త్తితో పదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమాలను చేపట్టి దేశానికే తెలంగాణ రాష్ర్టాన్ని రోల్‌మోడల్‌గా నిలిపారన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగా రాష్ట్ర సాధన సమయంలో చిన్నారులుగా ఉన్న వారు మొన్నటి ఎన్నికల్లో ఓటు హక్కు పొందారని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యే వారికి కేసీఆర్ ఉద్యమ చరిత్రను వివరించాలన్నారు.
గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే 60 స్థానాలు పోగొట్టుకున్నామని, దానికి కారణం యువతరం వచ్చి గ్రామాల్లో తిరిగి ఓట్లు అవతలి వారికి వేయించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మాజీ జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్‌రావు, జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు రజాక్, నాటి ఉద్యమ కారులు దావుల వీరప్రసాద్‌యాదవ్, కల్లెట్లపల్లి శోభన్‌తో పాటు మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యువత పెద్ద ఎత్తున తరలిరావాలి : బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్
ఈ నెల 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేపట్టబోయే దీక్షా దివస్‌ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి. ప్రధానంగా ఉద్యమ సమయంలో తొమ్మిది నుంచి పదేండ్ల వయసున్న వారికి ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలియదని అలాంటి యువతరం పెద్ద సంఖ్యలో వచ్చేలా బీఆర్ఎస్ శ్రేణులు చొరవ తీసుకోవాలి.
కలిసికట్టుగా గులాబీ జెండాను ఎగరేయాలి : తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్
కార్యకర్తల్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలను వదిలేసి అందరూ కలిసికట్టుగా ఉండి వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేయాలి. ప్రతి కార్యకర్త పార్టీని బలోపేతం చేయాలని, దాంతోనే విజయం సులభతరం అవుతుందని తెలిపారు. దీక్షా దివస్‌తో కేసీఆర్ చావునోట్లో తలకాయ పెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేయడం వల్లనే రాష్ట్ర సాధన సులభమైంది. ప్రస్తుతం తెలంగాణలో నిరాటంకంగా వస్తున్న విద్యుత్, నీళ్లతో పాటు సకల సౌకర్యాలు ఎప్పటి నుంచి ఎలా వస్తున్నాయి, వీటన్నింటినీ సాధించిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రాశస్త్యాన్ని యువతరానికి తెలియజేయాలి.
విజయాల బీఆర్ఎస్.. మోసాల కాంగ్రెస్ : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే రాష్ట్ర సాధన, అనంతరం సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే. బీఆర్ఎస్ విజయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలువగా ఉమ్మడి రాష్టంలోనైనా, నేటి అధికారంలో ఉండి అయినా కాంగ్రెస్ పార్టీ చేసేది మోసాలు తప్ప మరోటి లేదు. ఈ విషయాలను కూలంకషంగా నేటి యువతరానికి తెలియజేయాలి.
పిల్లలకు సీఎంగా కాకుండా ఉద్యమ నేతగా కేసీఆర్ తెలియదు : హుజూర్నగర్ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహా రెడ్డి
తెలంగాణలో కొద్ది మందికి కేసీఆర్ అంటే అభివృద్ధి చేశాడని, మరి కొందరికి సంక్షేమ పథకాలు చేశారని తెలుసు. కానీ ఉద్యమ నేతగా ఆయన ఏంటో ఆనాడు చిన్నపిల్లలుగా ఉన్న వారికి తెలియదు. అలాంటి వారికి ఉద్యమం, అనంతరం జరిగిన అభివృద్ధి గురించి తెలియాలి. తెలంగాణను ఎవ్వరూ ఇవ్వలేదు, రాజకీయ అనివార్యతతోనే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనకు వ్యతిరేకంగా యువతను జాగృతం చేసేందుకే రేపటి దీక్షా దివస్ ఓ వేదిక.
దీక్షా దివస్ రాష్ట్ర సాధనలో కీలక మలుపు : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పార్టీలోనే ఉన్నానని, ఆనాడు అన్ని వర్గాలు, మేధావులతో చేసిన చర్చలు, ఉద్యమ పంథా కోసం రూపొందించిన కార్యక్రమాలు, పదవులకు రాజీనామాలు ఇలా ప్రతి దానికి పగలు, రాత్రిని కరిగించడంతోనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ అనేది రాష్ట్ర సాధనకు కీలక మలుపు. దీక్షతో ప్రజలు రోడ్లపైకి వచ్చి చేసిన ఉద్యమం కేసీఆర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. ఆ నాడు తాము ప్రజల కోసం, తెలంగాణ కోసం కోర్టు మెట్లు ఎక్కాము తప్ప ఓటుకు నోటుతో కోర్టు మెట్లు ఎక్కలేదు.
ఎన్నిపోరాటాలు జరిగినా.. కేసీఆర్ వల్లే సాధ్యమైంది : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని పోరాటాలు చేసినా అది కేసీఆర్ వల్లే సాధ్యమైంది. 1960 నుంచే రాష్ట్రం కోసం పోరాటాలు జరిగాయి. 1969లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక మంది పోరాటం చేసినా చివరికి కేసీఆర్ వల్లనే సాధ్యం అయింది. 14ఏండ్ల పాటు ఆయన ప్రణాళికా బద్దంగా పోరాటం చేసినందునే రాష్ట్ర సిద్దించింది.
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే అన్ని వర్గాలను ఆగం చేసింది. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు ధాన్యం కొనుగోళ్లలో కూడా పారదర్శకత చూపించడం లేదు. నేడు రాష్ట్రంలో ప్రతి రైతు కాంగ్రెస్‌ను తిట్టి పోస్తున్నారు. రైతుగా కేసీఆర్ రైతుల బాధలు అర్థం చేసుకొని దగ్గరు తీస్తే రియల్టర్ అయిన రేవంత్ రియల్ రంగాన్ని మాత్రం కుదేలు చేశాడు.