యాదాద్రి భువనగిరి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో దగాకోరు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రజలను పీడించే పాలన అని ఫైర్ అయ్యారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు ‘ఓడ మల్లయ్య’ చందంగా ఉందని మండిపడ్డారు. తాజా బడ్జెట్ వల్ల ఏ వర్గానికీ ఉపయోగం లేదన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి నిధులు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని చెప్పినా.. రెండు పంటలకు కూడా దిక్కులేదన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఆఖరికి సన్న వడ్లకు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా అద్భుతంగా అమలు చేశారని, కాంగ్రెస్ ఆ పథకాన్ని ఎత్తేయడం దురదృష్టకరమన్నారు. రైతులకు 42 శాతం మాత్రమే రుణ మాఫీ చేశారని, మరో 58 శాతం మాఫీ ఊసేలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆయిల్ పామ్‌కు రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. పల్లెల్లో విపరీతంగా కరెంట్ కోతలు ఉన్నాయని, రోజుకు 20 సార్లు కట్ చేస్తున్నారని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలేదని ఆరోపించారు.
ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపారని వారు ఆరోపించారు. మహిళలకు నెలకు రూ. 2500 సాయం, పింఛన్ల పెంపు, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగులకు రూ. 4వేల భృతి ఏమైందని ప్రశ్నించారు. రాజీవ్ యువ వికాసానికి గత బడ్జెట్లో రూ.6వేల కోట్లు కేటాయిస్తే.. కనీసం 6వేల పైసలు కూడా ఖర్చు చేయలేదని, మళ్లీ ఈ సారి రూ. 6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పడం వంచన కాదా అని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని, గురుకులాలను గాలికి వదిలేశారని, 150 మంది విద్యార్థులను మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల కల్పన అంతా బూటకమని విరుచుకుపడ్డారు. బీసీ సబ్ ప్లాన్, బీసీ సంక్షేమానికి నిధుల్లేవన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటూ మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఐదేండ్లలో బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి, రెండున్నరేండ్లలో మూడు బడ్జెట్లు కలిపి రూ.20వేల కోట్లు దాటలేదన్నారు. విద్య, వైద్యంపై నిర్లక్ష్యం కనిపించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం అంతా మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పనంగా కాజేస్తున్నారని, అడ్డదారిలో, దొడ్డిదారిన జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని, స్వయంగా రేవంత్ రెడ్డే రూ. వెయ్యి కోట్లు రాహుల్ గాంధీకి బహుమతిగా సర్దిపెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి.. ఇతర రాష్ర్టాల ఎన్నికల కు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు. క్రైం రేటు పెరిగిందని, ఇది సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్‌ను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో 3.40 లక్షల కోట్ల అప్పు చేసి, ప్రాజెక్టులు నిర్మించి మేలు చేశారని, రేవంత్ రెడ్డి మాత్రం రెండున్నరేండ్లలోనే 3.50లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.నిషేధిత జాబితాలో ఇండ్లు, భూములు పొందుపరిచి.. వేలాది కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పీవోబీని పరిష్కరిస్తామని బాధితులకు విప్ బీర్ల అయిలయ్యనే హామీ ఇచ్చి.. అసెంబ్లీలో ఆయనే ప్రశ్నిస్తున్నారని, అసలు మీకు నిజాయతీ ఉందా అని నిలదీశారు. బీర్ల అయిలయ్య ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బీరు మల్లయ్య, అతికం లక్ష్మీనారాయణ గౌడ్ పాల్గొన్నారు.