యాదగిరిగుట్ట, మార్చి31: అధికారంలోకి రాగానే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామిపై ఒట్టేసి రైతులకు పంటకు రూ. 15 వేల రైతు భరోసా అందజేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డిని క్షమించి మంచిబుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్టాన్ని దోచుకుతింటోందన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నిరుపేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చి, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. రెండున్నరేళ్ల కాలంలోనే జనం నానా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులను పట్టించుకునే నాధుడే లేరన్నారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని వారు పేర్కొన్నారు. ఆలయాన్ని గొప్పగా పునర్నిర్మించి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏ భక్తుడిని అడిగినా కేసీఆర్ దేవస్థానాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కారు గుర్తుకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకులు పాల్గొన్నారు.