తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 7 : రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారాన్ని తిరుమలగిరి(సాగర్) మండలం నుంచి మొదలు పెడుతామని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్‌మిట్టల్ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భూ యాజమాన్య హక్కుల చట్టాల్లో ఆర్ఓఆర్, కొన్ని సాదాబైనామా, విరాసత్ వంటి సమస్యలను తీర్చడానికి నిబంధనలు లేనందున కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. రెవెన్యూ చట్టంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కొత్త చట్టం తేవాలన్న ఉద్దేశంతో ముసాయిదాను రూపొందించినట్లు చెప్పారు. నూటికి నూరు శాతం భూ సమస్యలను పరిష్కరించేందుకు తిరుమలగిరి(సాగర్) మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఐదు బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క బృందానికి తాసీల్దార్‌తో కూడిన సిబ్బందిని రెవెన్యూ గ్రామాలకు పంపించామని తెలిపారు.
రెండు, మూడు రోజుల నుంచి రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో రైతుల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ మండలంలో 11,246 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయని, అందులో 1,260 ఎకరాల్లో అటవీ భూములు ఉండగా 3,931 ఎకరాలు మాత్రం ధరణిలో వచ్చిందని, ఇంకా సుమారు 7వేల ఎకరాలు ధరణిలోకి రావాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి డొంక దారులు ఉన్నాయని, వాటికి ఇరువైపులా ఉన్న పొలాల వారు ఆక్రమించుకున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్ అలాంటి వాటికి తావు లేకుండా రికార్డ్ ఆధారంగా పరిశీలించి దారిని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్డీఓ శ్రీనివాస్‌రావు, సర్వే, ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, హరి, శ్రీనివాస్‌శర్మ, దశరథ్ నాయక్, తాసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.