– దొడ్డి దారిని గెలిచేందుకు కుట్రలు
– కోదాడ 11వ వార్డులో నిర్బంధంగా ఆరు నామినేషన్ల ఉపసంహరణ
– 11వ వార్డులో ఎన్నిక జరపాలని రోడ్డెక్కిన ప్రజలు
– తిరిగి నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్
కోదాడ, ఫిబ్రవరి 03 : కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నిరసన తెలుపుతూ కోదాడ ప్రధాన రహదారిపై గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం.. కాంగ్రెస్ దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. 11వ వార్డులో తమ అభ్యర్థి గీతా ప్రసాద్‌ను బ్లాక్‌మెయిలింగ్ చేసి ఒత్తిడితో నామినేషన్ ఉపసంహరింపజేశారని మండిపడ్డారు. నేరుగా బీఆర్ఎస్ తో ఎన్నికల బరిలో నిలిచే సత్తా లేక పోలీసులను, అధికారులు అడ్డం పెట్టుకుని ఈ దాష్టీకానికి వడికట్టారన్నారు. నిబద్ధతగా విధులు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం కూడా చేష్టలుడిగి చూస్తుందన్నారు. ఇప్పటికే తాము ఈ అంశంపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని ఎన్నికలను వాయిదా వేసి నిష్పక్షపాతంగా తిరిగి జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్ దంపతులు అక్రమంగా డబ్బు సంచులతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు దిగజారి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకోమని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 11వ వార్డులో తమ అభ్యర్థిని బెదిరించడం వల్లే భయభ్రాంతులకు గురై నామినేషన్ ఉపసరించుకున్నారన్నారు. అందుకు నిరసన తెలుపుతూ తమ వార్డును ఏకగ్రీవం చేయొద్దని అంబేద్కర్ ఆకాంక్షల కనుగుణంగా ఎన్నికల ప్రక్రియ జరపాలని ప్రధాన రహదారిపై నినాదాలు చేస్తూ కాలనీవాసులు ఆందోళన చేశారన్నారు. ఈ నెల 11న ఎన్నిక ప్రక్రియ కూడా సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం లేదని, వెంటనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తిరిగి నామినేషన్ల ప్రక్రియ జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, నాయకులు భూపాల్ రెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్, కర్ల సుందర్ బాబు, చీమ శ్రీనివాస్, మేదర్ లలితా, భాగ్యమ్మ, అబ్బు, గట్ల కోటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.