తుర్కపల్లి, సెప్టెంబర్5 : కాళేశ్వరం జలాలు జిల్లాకు మూడో సారి వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు విడుదల చేయగా ఇప్పుడు మూడో దఫా వస్తున్నాయి. కాల్వల ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నింపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు జిల్లాలో ఆశించినంత లేకపోవడంతో ఈ కాళేశ్వరం జలాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
నిండుతున్న చెరువులు..
కొండపోచమ్మసాగర్ నుంచి నీటి విడుదలతో తుర్కపల్లి మండలంలోని గోపాల్పురం గ్రామంలో కొండపోచమ్మ చెరువు, నాగాయపల్లి చెరువు, చిన్నలక్ష్మాపురంలోని దాపల్చెరువు, మాదాపురం జగ్గయ్యచెరువు, కొత్త చెరువు, గోపాల్పురంలోని పొట్టొనికుంట చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి.
బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో రామసానికుంట చౌటకుంట, నల్లచెరువు, ఎర్రకుంట, తిమ్మాపురంలోని గూడెంచెరువు, తిమ్మప్ప చెరువు, ప్యారారంలోని మల్లన్న చెరువు, సోలిపేటలోని ఊరచెరువులోకి కాళేశ్వరం జలాలు వచ్చి వచ్చి చేరుతున్నాయి.
ఎం.తుర్కపల్లి ప్రధానకాల్వ ద్వారా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొత్తకుంట, పంతెకుంట చెరువు, మైసమ్మకుంట, బండదరాణి కుంట, చాపల కుంట, తుర్కపల్లిలోని బహదూర్మియా చెరువు, వెంకటపురంలోని సూదిలేని చెరువు, తోక చెరువు, మల్కపురంలోని లిప్పకుంట, రావులవాణికుంట చెరువులోకి నీరు వచ్చి చేరగా, ముల్కలపల్లిలోని చౌదరి చెరువు, ధర్మారంలోని విఠల్చెరువు, గోవింద్చెరువు, గొల్లగూడెం కాపల్చెరువు, కొత్త చెరువు, పటేల్‌చెరువు, పల్లెపహాడ్‌లోని సోమయ్యచెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. బొమ్మలరామారం మండలంలోని మల్లారెడ్డి చెరువు కాళేశ్వరం జలాలతో నిండాయి. మరికొన్ని రోజుల్లో వందశాతం నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
2020 నుంచే
జిల్లాకు సాగు జలాలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు సఫలీకృతమయ్యాయి. గతంలో 2020లో స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుర్కపల్లి ప్రధానకాల్వకు కొండపోచమ్మసాగర్ జలాలను విడుదల చేయించారు. 2023లో ఎం తుర్కపల్లి కాల్వకు సైతం నీటిని విడుదల చేశారు. నాటి నుంచి పలు రకాలుగా జిల్లాలోని 2 మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా ఆశించినంత ఫలితం లేకుండా పోయింది. వ్యవసాయానికి నీళ్లు అందే పరిస్థితి లేదు. రెండు మండలాల వ్యాప్తంగా చాలా చోట్ల వరిపంట ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెల 7న ఇరిగేషన్ అధికారులు కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు.
ఆగష్టు 7 నుంచి నీటి విడుదల
గత నెల ఆగస్టు 7న సిద్దిపేట జిల్లా దామరకుంట వద్ద కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి(ఎం) కాల్వల్లో 1.50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తుర్కపల్లి ప్రధానకాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 12 చెరువులు నింపగా 1,496.24 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతున్నది. ఎం.తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 19 చెరువులు నింపగా 1496.24ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు చేరుతున్నది.
కాళేశ్వరంతో నీళ్ల సమస్య తీరింది
మాజీ సీఎం కేసీఆర్ రైతుల బాధ తెలిసినోడు. రైతులకు నీళ్ల సమస్య రావొద్దని పసిగట్టిండు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలు విడుదల చేసిండు. మా మండలానికి ఈసారితో మూడు దఫాలుగా కాళేశ్వరం జలాలు వచ్చినయ్. అది కేసీఆర్ పుణ్యమే.
– నారం పెద్దులు, రైతు, గోపాలపురం, తుర్కపల్లి మండలం