నీలగిరి, జూన్ 26 : భవిష్యత్ బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని, ఇందులో భాగంగా నల్లగొండలో రూ.34 కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థులకు లైఫ్ టర్నింగ్ టైం అని, 20 ఏండ్ల వరకు చదువు, స్పోర్ట్స్, యోగాపై దృష్టి పెట్టాలని సూచించారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉందాలని, అవసరమైతేనే వాడాలని, చదువుపైనే దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధించాలన్నారు. పట్టణంలోని ప్రకాశం బజార్లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నట్లు, డిజిటల్ తరగతులతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఏం కావాలన్నా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా, మంత్రిగా సహకారం అందించనున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. మిషన్ పరివర్తన్ కింద వారం రోజులపాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలు అవుతారని, అందువల్ల తీసుకోవద్దని, డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం అందితే డయల్ 100కు ఫోన్ చేసి తెలుపాలన్నారు. నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా చేద్దామని పిలుపునిచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడొద్దని సూచించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి భవిత కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు ఎస్పీ రమేశ్, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.
Nalgonda : భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి