కోదాడ, సెప్టెంబర్ 8 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. వరద ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇండ్లు కూలిపోగా మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విలువైన సామాన్లు, డాక్యుమెంట్లు నీటిపాలయ్యాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమై రాకపోకలకు అతరాయం కలిగింది. ఈ సారి అనుకూల వాతావరణం ఉండడంతో సిరులు కురిపిస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ వర్షాలు కన్నీటిని మిగిల్చాయి. ఇక వరదతో గ్రామాలు, పట్టణాలు బురదమయంగా మారాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున్న ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో డెంగ్యూతో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ దవాఖానలు రోగులతో నిండిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేక, మందుల కొరతతో రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
హుజూర్నగర్, కోదాడ నియోజక వర్గాల్లో 22,524 ఎకరాల్లో పంట నష్టం
వరదకు హుజూర్నగర్ నియోజక వర్గంలో 7,374 ఎకరాల్లో, కోదాడ నియోజక వర్గంలో 15,150 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. మేళ్లచెర్వు, మఠంపల్లి మండలంలో 1,405, చింతలపాలెంలో 1,179, హుజూర్‌నగర్‌లో 1,330, గరిడేపల్లిలో 1,160, పాలకవీడులో 200, కోదాడలో 5,350, మోతెలో 1,260, అనంతగిరిలో 2,606, చిలుకూరులో 3,009, నడిగూడెంలో 1,200, మునగాలలో 1260 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది.
అమాత్యా.. ఆలకించరూ !
‘కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలోని ప్రజలంతా మా పిల్లలే.. కుటుంబ సభ్యులే.. వారి అభివృద్ధికి మా జీవితాలను అంకితం చేస్తున్నాం’ అని మూడున్నర దశాబ్దాలుగా ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి చెప్తున్న మాటలివి. కానీ ఈ రెండు నియోజకవర్గాలు ఇప్పుడు వరదతో సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. మంత్రి, ఎమ్మెల్యే అయిన ఉత్తమ్, పద్మావతి తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించి వెళ్తున్నారే తప్ప ఆదుకోవడం లేదని బాధితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.