– జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– పాల్గొన్న మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే
దామరచర్ల, ఆగస్టు 01 : నల్లగొండ జిల్లా దామర్లచర్ల మండలం వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్‌ను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే రూ.970 కోట్ల వ్యయంతో వైటీపీఎస్‌లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఈ డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని అన్ని యూనిట్లను పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకుగాను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పని చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా టౌన్షిప్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆస్పత్రులు నిర్మించి, అంబులెన్స్ ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మేలు జరిగేలా చూడాలన్నారు. బొగ్గు లారీలు, బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా సీసీ రోడ్లను మంజూరు చేయడం జరిగిందని, యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించి నష్ట పరిహారం, భూ సేకరణకు సంబంధించిన పనులు సైతం వెంటనే పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్ రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ వి.కుమార్ రాజు, వైటీపీఎస్ పర్యవేక్షక ఇంజినీర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Damarlacharla : వైటీపీఎస్ మొదటి యూనిట్ ప్రారంభం