సూర్యాపేట, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ అధికారుల అర్థంపర్థం లేని విధానాలతో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఫైనల్ పరీక్షలకు ముందు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ సారి జిల్లా అధికారులు ఎలా ఆలోచించారో తెలియదు కానీ అత్యంత ముఖ్యమైన సమయంలో విద్యార్థులకు స్పెషల్ ప్రీ ఫైనల్ టెస్టులు నిర్వహించారు. దీంతో ఫిబ్రవరి నెల మొత్తం కలిపి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా రివిజన్‌కు అవకాశమే లేకుండా పోయిందంటున్నారు.
ఫిబ్రవరిలో 14 రోజులు పరీక్షలు, 4 రోజులు ఎన్నికలు, ఆది, శనివారాలతో కలిపి మరో 6 రోజుల సెలవులు వచ్చాయి. దీంతో పాటు ఫార్మెట్ ఎసెస్మెంట్ వెరిఫికేషన్ కోసం ఉపాధ్యాయులు రెండు రోజలు బిజీ. ఈ లెక్కన ఫిబ్రవరి నెలలోని 28 రోజుల్లో 26 రోజులు విద్యార్థులకు రివిజన్‌కు అవకాశం లేకుండా పోయింది. అసలే పోటీని తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలలు ఏడాదికేడాది కునారిల్లి పోతున్నాయి. 6, 7 తరగతుల నుంచి పది వరకు బాగా చదివే విద్యార్థులను కార్పొరేట్ విద్యా సంస్థలు గద్దల్లా ఎత్తుకు పోతున్న విషయం విదితమే. ఇక కూలినాలి చేస్తూ చదువులేని పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల పిల్లలే అత్యధికంగా ప్రభుత్వ పాఠశాల్లో మిగిలిపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు నాన్‌వెజ్ పెట్టడం, స్నాక్స్ తదితరాలు అందించడంతో పాటు, వేలాది గురుకులాల ఏర్పాటు, మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరణ, సౌకర్యాల ఏర్పాటు చేయడంతో కాస్త మెరుగుపడుతున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో దాదాపు మళ్లీ అన్నీ పథకాలు అటకెక్కాయి. ఇదిలా ఉంటే ప్రతిసారీ పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలోనే ర్యాంకులు రావాలి.. 80 నుంచి 90 శాతం మార్కులు సాధించాలని టార్గెట్లు పెడుతుంటారు. వాస్తవానికి క్లాసులో అందరికీ 80 నుంచి 90 శాతం వచ్చిన దాఖలాలు ఎన్నడూ లేవు. అలా వస్తే మంచిదే కానీ సూర్యాపేటలో అర్థంపర్థం లేని విధానాలతో చిరాకు కల్గిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పిల్లలకు జ్ఞానం పెంచడం అంటే పరీక్షలు మాత్రమే కాదు. కానీ పరీక్షలు, మానిటరింగ్‌తో పాటు విద్యార్థులపై వత్తిడి పెంచి, పరీక్షలు తప్ప చదువుకునే అవకాశం లేకుండా చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 1 లోపు సిలబస్ పూర్తి చేసి అనంతరం ఆయా సబ్జెక్టు టీచర్లు విద్యార్థులకు రివిజన్ చేయాల్సి ఉంటుంది. రివిజన్‌కు దాదాపు 20 రోజుల సమయం ఉండటంతో రెండు చాప్టర్లకు ఒక పరీక్ష ప్లాన్ చేసేవారు. కానీ ఈ సారి జిల్లా అధికారులు ఫిబ్రవరి 3 నుంచి ఎక్కడా లేని విధంగా స్పెషల్ ప్రీ ఫైనల్ టెస్టులంటూ మొత్తం సిలబస్‌పై పరీక్షలు పెట్టారు.
ఇవి పూర్తయిన సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు ప్రీ ఫైనల్‌కు షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులకు రివిజన్ చేసుకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలు ఎలా వస్తాయో ఊహించవచ్చు. ఫిబ్రవరిలో దాదాపు 20 రోజుల పాటు రివిజన్ చేసి, మెయిన్ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులకు ఈ సారి సమయమే లేకుండా పోయింది. అధికారులు తెలివితో చేశారో లేదో కానీ పరీక్షలనేవి రివిజన్‌కు కొలమానం కాదు. వరుస పరీక్షల వల్ల అన్నీ మర్చిపోయే ప్రమాదం ఉందని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. మార్చిలో ప్రారంభం కాబోతున్న పది పరీక్షల్లో ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.