నల్లగొండ, డిసెంబర్ 15 : ఉన్నత చదువులు చదువడానికి ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ న్యూజెర్సీ(యూఎస్ఏ) సహకారంతో రూ.1.53లక్షల విలువైన చెక్కులను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదిరి కిశోర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం అందించారు. సోమవారం కిశోర్ జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు దాట్ల చందన, ఎం ప్రభాకర్, వేణు ఆధ్వర్యంలో సీఎంఆర్ కళాశాలలో మెడికల్ విద్యనభ్యసిస్తున్న కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన అందుగుల ప్రవళికకు మూడో సంవత్సరం ట్యూషన్, రెసిడెన్షియల్ ఫీజుకోసం రూ.1.30లక్షలు చెక్కు ఇచ్చారు.
అదే విధంగా సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరంలో సీటు పొందిన కనగల్ మండలం చెట్ల చెన్నారానికి చెందిన తలకొప్పుల వంశీకి రూ.23వేల చెక్కు అందించారు. వారి చదువు పూర్తయ్యే వరకు ఫీజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెల్లిస్తామని సభ్యుడు తిరుమల వేణు అన్నారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదువుకునే ఎంతో మంది నిరుపేదలకు ఆశాజ్యోతి ఫౌండేషన్ అండగా నిలవడం సంతోషకరమైన విషయమన్నారు. ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, కౌన్సిలర్ మాడ్గుల గణేశ్ పాల్గొన్నారు.