యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చేనేత కార్మికులపై కరుణ చూపించింది. పొదుపు పథకానికి సంబంధించి 11 నెలలుగా బకాయి పడిన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాకు 17 కోట్లు రిలీజ్ చేసిం ది. ఆయా సొమ్మును చేనేత గ్రూపులకు అధికారులు అందజేస్తున్నారు.
నేతన్నలకు సామాజిక భద్రత కల్పించడం కోసం నాడు మాజీ సీఎం కేసీఆర్ చేనేత చేయూత పథకాన్ని తీసుకొచ్చారు. నేత కార్మికుల నెలసరి చేనేత ఆదాయంలో ఎనిమిది శాతం ఆర్డీ1లో జమ చేసిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీ2లో 15శాతాన్ని నేరుగా జమ చేయాలి. ఆ మొత్తం నగదు వడ్డీతో సహా మూడేండ్ల తర్వాత కార్మికులకు అందుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబ్బులు జమ చేయడమే మరిచిపోయింది. సెప్టెంబర్ నుంచి 11 నెలలుగా డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కాగా ప్రస్తుత 2021-2024 సంవత్సరానికి ఆగస్టు 31న సీమ్ గడువు ముగిసింది.
ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మరోవైపు పొదుపు పథకం కోసం కొనసాగింపుపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పథకం ఉంటుందా..? కొనసాగుతతుందా..? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు సంబంధించిన పథకాలకు ఒకొకటిగా పాతర వేస్తున్నది. నేతన్నల కోసం బీఆర్ఎస్ సరారు తీసుకొచ్చిన చేనేత మిత్ర పథకానికి మంగళం పాడింది. నేత కుటుంబానికి నెలకు రూ.3వేలు చెల్లించకుండా అటకెకించింది.
గతంలో చేనేత మిత్ర పథకం కింద ప్రభుత్వం నూలు, రసాయనాలు, ముడి సరుకులకు సబ్సిడీ ఇచ్చేది. నూలు, సిల్ , ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై 40శాతం సబ్సిడీ కల్పించేది. అయితే సబ్సిడీ పొందడం నేతన్నలకు ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన నేతన్నలకు నెలకు రూ.30వేల సాయం అందించాలని నిర్ణయంచింది. కార్మికుల కుటుంబాలకే నేరుగా డబ్బులు జమ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక పైసా కూడా చెల్లించలేదు. పథకాన్ని బంద్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.