రామగిరి, నవంబర్ 06 : నల్లగొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ జంక్షన్ వెల్కమ్ నల్లగొండ వద్ద రహదారిపై ఏర్పడిన గుంతల వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి ఇలాకలో గుంతల మయంగా మారిన రోడ్లను మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గుంతల్లో వాహనాలు పడుతూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. మర్రిగూడ జంక్షన్ తో పాటు పెద గడియారం నుండి సావర్కర్ నగర్ వరకు, భాస్కర్ టాకీస్ సెంటర్లో, బస్టాండ్ ముందు ఇలా అనేక చోట్ల రహదారులపై పెద్ద పెద్ద గుంతలు పడ్డాయని, వాటిని పూడ్చడానికి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారుల సమన్వయ లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు.
జిల్లా మంత్రి, కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతా నల్లగొండకు అదే దారి వెంట వస్తున్నప్పటికీ ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు కనపడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టణంలో పలుచోట్ల ఏర్పడిన గుంతలను పూడ్చడానికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, మల్లం మహేశ్, పట్టణ కమిటీ సభ్యులు ఆవుట రవీందర్, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, అద్దంకి నరసింహ, గుండాల నరేశ్, కడారి నరసింహ, గంజి రాజేశ్, కత్తుల యాదయ్య, మిర్యాల శ్రీవాణి, పగిళ్ల సైదులు, గౌరీదేవి మధుసూదన్, సాగర్ల మల్లయ్య, దొమ్మాటి యాదగిరి, కర్నాటి శ్రీరంగం, గౌరీదేవి మల్లమ్మ, పాలకూరి గిరి పాల్గొన్నారు.