నల్లగొండ సిటీ, డిసెంబర్ 03 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వానాకాలంలో రైతులకు ఎరువుల విక్రయాల్లో కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అక్టోబర్ మాసం నుండి ఈపాస్ మెషిన్ లో విక్రయాలను మరింత పటిష్టం చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి రైతు గత అక్టోబర్ నుండి ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఎరువుల వివరాలను ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఈ పాస్ మిషన్లో చూపడం జరుగుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు అవసరం మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా జిల్లాలో యాసంగిలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.