రామగిరి, జూలై 8: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బాలికల హాస్టల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. కొంతకాలం గా తాగునీరు, వాడుక నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థినులు మంగళవారం రాత్రి అన్నం తిన్న తర్వాత తాగునీరు, ఇతర అవసరాలకు నీరు లేకపోవడంతో తమ హాస్టళ్ల ఎదుట రాత్రి 11 గంటల వరకు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకోకపోవడంతో నేరుగా వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ గెస్ట్ హౌస్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. వర్సిటీ పాలకమండలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రంతా నిరసనలు కొనసాగించారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థినులు వినకపోవడంతో వీసీ వచ్చి మాట్లాడారు. వీసీ సమస్యలను పరిష్కరించకపోగా ముందు వరుసలో ఉండి మాట్లాడుతున్న విద్యార్థినులతో మీరు.. పరీక్షలు ఎలా రాస్తా రు..? మీరంతా పాసవుతారా అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెల్లవారు జామున 4 గంటల వరకు ఆందోళన కొనసాగింది. నూతన భవన నిర్మాణ పనులకు నీటిని మళ్లీంచడం వల్లే సమస్య వచ్చిందని విద్యార్థినులు తెలిపారు. ఇదే విషయం పాలక మండలి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, హాస్టళ్లలో నీరు లేకపోవతే విద్యార్థినులు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి కమిటీని నియమించి విచారణ చేపట్టాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
యూనివర్సిటీకి వచ్చిన అదనపు కలెక్టర్
విషయం తెసిన ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో యూనివర్సిటీలోకి వచ్చారు. బాలికల హాస్టళ్ల వద్దకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. విద్యార్థినులు తమ గోడును ఆయనకు వినిపించి కన్నీటి పర్యంతమయ్యారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు విద్యార్థినులు వెల్లడించారు.