సూర్యాపేటటౌన్, సెప్టెంబర్ 20: బోసి నవ్వులతో ముద్దులొలికే అభం శుభం తెలియని చిన్నారిని అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడై చిదిమేశాడు. మద్యం మత్తులో కన్న తండ్రి 11 నెలల కూతురి కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… నాగారం మండలం డికొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య నాగమణి, కుమార్తె భవిజ్ఞ(11)తో కలిసి పట్టణంలోని ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్నారు. సొంత ఊరికి వ్యవసాయ పనులకు వెళ్లి రాత్రి పొద్దుపోయాక వెంకటేశ్వర్లు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. నిద్రిస్తున్న చిన్నారి లేచి ఎడువ సాగింది. చిన్నారి ఏడుపుతో పక్కింటి వారికి తెలుస్తుందని ఆమె నోరు మూశాడు.
అడ్డొచ్చిన భార్యను నెట్టేయడంతో దూరంగా గొడకు గుద్దుకుంది. ఆమె తేరుకొనేలోపే చిన్నారి కాళ్లు పట్టుకొని రెండుసార్లు నేలకేసి కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని తల్లి స్థానికుల సహాయంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. చిన్నారిని హత్య చేసి పరారయ్యేందుకు యత్నించిన కసాయితండ్రిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
కుమార్తె మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లి గుండెలవిసేలా విలపిస్తున్న తీరు అందరినీ కలచి వేసింది. హంతకుడు సైకోలా వ్యవహరిస్తూ వేధింపులకు గురి చేయడంతో మొదటి భార్య విడాకులు తీసుకుంది. రెండేండ్ల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడుకు చెందిన నాగమణిని రెండో వివాహం చేసుకున్నాడు. ‘బీటెక్ వరకు చదువుకున్న కొడుకు ప్రయోజకుడవుతాడనుకున్న. ఇంత రాక్షసంగా కన్న కూతురునే చంపే కసాయి అవుతాడనుకోలేదు. వాడిని ఉరి తీయాలి’ అని వెంకటేశ్వర్లు తండ్రి, అతని సోదరి వేడుకుంటున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు.