– టైర్ పేలడంతో డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
– ఇద్దరు డ్రైవర్లకు గాయాలు, ప్రయాణికులు సురక్షితం
కట్టంగూర్, జూన్ 30 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా టైర్ పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా, లారీ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయట పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. కట్టంగూర్ 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ శ్రీనివాస్, పైలట్ సమీర్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.