పెన్‌పహాడ్, మార్చి 1 : ‘ఈ ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నా.. రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా ఆదుకోండి’ అంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపక్షంలో రైతుల ఉసురు పాలకులకు శాపంగా మారుతుందని హెచ్చరించారు. మండలంలోని గాజులమల్కాపురం, చిన్నగారకుంట తండాలో ఎండిన పంట వరి పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. జగదీశ్‌రెడ్డి రాకతో రైతులు పెద్దఎత్తున చేరుకుని నీళ్లు లేక ఎండిన వరి పంటను గొర్లు, పశువులకు మేతగా ఇచ్చామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎండలేదని రైతులు గుర్తుచేశారు. పుష్కలంగా నీళ్లతో మడికట్లలో చేపలు కూడా పట్టుకున్నామని, నేడు ఎండిన పొలాలను మళ్లీ చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
మీరే ఏమన్నా చేయాలంటూ రైతులు, గిరిజన మహిళలు కోరారు. గాజులమల్కాపురంలో పొట్టదశలో ఉన్న వరి పైరును కాపాడుకునేందుకు రైతు గుండా వెంకన్న వాటర్ ట్యాంక్‌తో నీళ్లు పెడుతుండడం చూసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చలించి కంట తడి పెట్టారు. మీ హయాంలో నీళ్లు, కరెంట్ కష్టాలు లేకపోవడంతో ధీమాగా పంటలు పండించుకున్నామని, ఇయ్యాల దింపుడుగల్లం ఆశగా ట్యాంకర్‌తో నీళ్లు పెడుతున్నామని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపమేనన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, గోదావరిలో 10వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం పంటలను ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే చాలు పంటలన్నీ పండుతాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మాకు అప్పగించి చూడండి.. మూడ్రోజుల్లో చివరి ఎకరం వరకూ నీళ్లు పారిస్తామని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నదని మండిపడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికైనా కండ్లు తెరిచి నీళ్లు ఇచ్చి ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా.. రైతులకు సాగు నీరు ఇవ్వండి. రైతులను చంపకండి అంటూ ఆవేదన చెందారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగందర్, సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతరాంరెడ్డి, నాతల జానకిరాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ షేక్ బాషా, మొరిశెట్టి శ్రీనివాస్, ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, షేక్ షరీఫ్, లక్ష్మణ్, దారావత్ మోతీలాల్‌నాయక్, మామిడి అంజయ్య, మామిడి పరందాములు, కట్ల నాగార్జున పాల్గొన్నారు.