తెలంగాణ రైతాంగం పట్ల మోదీ సర్కారు చేస్తున్న కుట్రలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రైతు కల్లాల డబ్బులను తిరిగి చెల్లించాలన్న కేంద్రం హుకూంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని ఏండ్ల తరబడి రైతులు కోరుతున్నా పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. కుట్రలు చేస్తూ, కొర్రీల మీద కొర్రీలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన రైతు మహాధర్నాలో పార్టీ శ్రేణులతో కలిసి రైతులు, రైతుబంధు సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినదిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.
నల్లగొండ సెంటర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన మహాధర్నాలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, ట్రైకార్ చైర్మన్ రాంచంద్ర నాయక్, జిల్లా రైతుబంధు సమితి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర మెడలు వంచే వరకు రైతుల పక్షాల బీఆర్ఎస్ అధ్యర్యంలో పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
-నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్23(నమస్తే తెలంగాణ)
నల్లగొండ, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండడపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా రాష్ట్రం నిర్మించిన పంట కల్లాలపై ఆక్షేపం తెలుపడంతో నిధులు వెనక్కి ఇవ్వాలని హుకూం జారీ చేయడంపై మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు
జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో చేపట్టిన రైతు ధర్నా దద్దరిల్లింది.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితోపాటు ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ హఠావో-దేశ్‌కీ బచావో, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి, జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కవి గాయకుడు నకిరేకంటి సైదులు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, కేసీఆర్ రైతులకు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటలు పాడి అలరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నాయకులు జెల్లా మార్కండేయులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల, పట్టణ పార్టీల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మోదీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.

దేశానికి అన్నం పెడుతున్నది తెలంగాణ రైతాంగమే
దేశంలో ఉత్తరాది ప్రజలకు అన్నం పెడుతున్నది తెలంగాణ రైతాంగమే. దశాబ్దం క్రితం మూడు వేల కోట్ల విలువైన ధాన్యం పండించిన తెలంగాణలో నేడు 23వేల కోట్ల విలువైన ధాన్యం పండిస్తున్నది. ఇదంతా కేసీఆర్ విజన్. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు పన్నుతున్నది. నాడు కరెంట్ కటకట, నిరుద్యోగం, నీటి వనరుల లేమితో ఇబ్బంది పడ్డ తెలంగాణ సమాజం నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అవన్నీ పొంది ఎంతో సంతోషంగా ఉన్నారు.
-కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రం కుట్రలు
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తుంటే వాటిని తీసుకుంటున్న కొందరు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలు బాగున్నాయని ఓ వైపు అవార్డులు ఇస్తున్న కేంద్రం మరో వైపు డబ్బులు ఇవ్వకుండా అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉంది. పదేండ్ల కింద తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేని మోదీ ప్రభుత్వం ఈడీ, బోడీల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్నున్నది.
-నల్లమోతు భాస్కర్‌రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే
కేంద్రం క్షమాపణ చెప్పాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను, కుట్రలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఉద్యమాలు చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పే పరిస్థితి నెలకొన్నది. ఈ సారి కూడా అదే పరిస్థితి సృష్టించాలి. దేశంలో ఎక్కడాలేని పథకాలు రాష్ట్రంలో అమలవుతుంటే మోదీ సర్కారు ఓర్వలేక పోతున్నది. ఉద్దేశంతోనే ఈ కుట్రలు చేస్తున్నది.
-నోముల భగత్‌కుమార్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ నుంచి వ్యవసాయ రంగాన్ని వేరు చేయలేరు
మోదీ, అమిత్‌షా ఎన్ని ఎత్తుగడలు వేసినా సీఎం కేసీఆర్ నుంచి వ్యవసాయ రంగాన్ని, రైతులను వేరు చేయలేరు. పంట కల్లాలు ఉపాధి హామీ పథకంలో లేవని పంట కల్లాలకు ఖర్చు చేసిన నిధులు రూ.151 కోట్లు వెనక్కి ఇవ్వాలనడం దుర్మార్గమైన చర్య. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్నది. గత వేసవిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ప్రతి గింజా కొన్నారు. 75 ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాలు అందచేస్తున్న ఆర్థిక సంఘం నిదులు ఆపడం ఈ ఒక్క బీజేపీ ప్రభుత్వమే చేసింది. ఈజీఎస్ నుంచి రావాల్సిన రూ.12వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టి వ్యవసాయ రంగాన్ని దెబ్బ కొట్టాలని కేంద్రం పన్నుతున్నది. బీజేపీకి రైతులు గుణపాఠం చెప్పక తప్పదు.
-రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే
కార్పొరేట్ దొంగలకు అండగా మోదీ, అమిత్‌షా
అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లోకి రూ.15 లక్షల కోట్లు వేస్తామని మోదీ చెప్పారు..అది నెరవేరపోగా 12లక్షల కోట్లు దోచుకొని పారిపోయిన గుజరాత్ కార్పొరేట్ దొంగలకు మాత్రం మోదీ, అమిత్‌షా అండగా ఉంటున్నారు. తెలంగాణపై కక్షగట్టి రైతుల పంట కల్లాల నిర్మాణాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. 15 ఆర్థిక సంఘం నిధులు నిలిపివేస్తే జిల్లా, మండల, గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిపి వేసి తెలంగాణ రాష్ర్టాన్ని వెనుబడేలా చేయటానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. త్వరలో దేశంలో అన్ని రాష్ర్టాలు బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తాయి, అప్పుడు కేసీఆర్ శక్తి ఏంటో కేంద్రానికి తెలుస్తుంది.
-జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి
బీజేపీ నేతలకు గుణపాఠం తప్పదు
గత ఉపఎన్నికలో దేశం నుంచి వచ్చిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇంకా మీ బుద్ధి మార్చుకోకుండా అబద్ధాలు ఆపకుండా నిక్కి నిక్కి మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి పెట్టే వాతకు ఎక్కి ఎక్కి ఏడుస్తారు. మేం ఇద్దరం (మోదీ, అమిత్‌షా) మాకు ఇద్దరు (అంబానీ, అదానీ) అనుకునే విధానం దేశ ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో ఆ నలుగురికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైనది. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం తప్పదు.
-కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
బీజేపీ కుట్రలను ఎదుర్కొందాం..
రైతే ఒక సీఎం అయినందునే నేడు రైతు కష్టాలు పోయాయి. సమైక్య పాలనలో తెలంగాణ ఎంత నిర్లక్ష్యానికి గురైందో నేడు ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో మనమే ప్రత్యక్షంగా చూస్తున్నాం. కేసీఆర్‌ను బలహీన పరచడానికి, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నది. దానిని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉన్నది.
-ఎంసీ కోటిరెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
రైతు జోలికొస్తే ఊరుకోం
అన్నం పెట్టే రైతును నేడు బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది. నిత్యం వ్యాపారం గురించి ఆలోచించే చాయివాలాలకు అంబానీ, అదానీలే కావాలి కానీ రైతులు, వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇప్పటికే రైతులతో చీత్కారాలు తిన్నది సరిపోలేదా? మరోసారి రైతుల జోలికి వస్తే ఊరుకోం.
-చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ పథకాలపై దేశ వ్యాప్తంగా డిమాండ్
దేశ వ్యాప్తంగా తాను కొన్ని రాష్ర్టాల్లోని రైతుల పరిస్థితి చూసినప్పుడు అక్కడికి మన తెలంగాణకు చాడా తేడాలున్నాయి. అక్కడి పాలకులు రైతులను పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ అమలవుతున్న రైతు పథకాలను తమ దగ్గర అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల గురించి ఏమీ తెలియని బీజేపీ వాళ్లతో దేశ వ్యవసాయ రంగానికి చాలా మప్పు ఉన్నది.
-రాంచందర్‌నాయక్, ట్రైకార్ చైర్మన్
తిడితే ఓట్లు పడుతాయనేది భ్రమ
తెలంగాణ తెచ్చిన జాతి పిత సీఎం కేసీఆర్. అలాంటి గొప్ప వ్యక్తులను తిడితే ఓట్లు రావు. ఈ బండి గాళ్లు, గుండు గాళ్లు తిట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు. రాష్ట్రంపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. దేశంలో బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీకీ చెమటలు పడుతున్నాయి. త్వరలో బీఆర్ఎస్ జెండా ఢిల్లీ కోటపై ఎగురుతుంది.
-దూదిమెట్ల బాలరాజు యాదవ్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్