పుష్కలంగా సాగునీరు, కరెంట్ ఉండడంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడింది. దీనికి తోడు ట్రాక్టర్ దున్నడం, నాట్లు వేయడం తదితర వాటికి ఖర్చులు భారీగా అవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు రైతులు రెండు మూడేండ్లుగా వెదజల్లుడు, డ్రమ్ సీడర్ పద్ధతికి ఆసక్తి చూపుతున్నారు. పొడి దుక్కిలో సైతం సీడ్ డ్రిల్తో వరి వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కొత్త విధానంలో సాగు చేసిన రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం వానకాలంలో 18 వేల ఎకరాల్లో వెదజల్లుడు పద్ధతిలో సాగు చేయగా ఈ సారి 48వేల ఎకరాలకుపైనే చేరింది. 12వేల ఎకరాలకుపైనే డ్రమ్సీడర్ను వినియోగించగా ఈ సారి 35 వేల ఎకరాలకు పెరిగింది.సాధారణంగా వరినాట్లతో పోలిస్తే వెదజల్లుడు, డ్రమ్సీడర్ విధానంతో రైతులకు ఎకరాకు రూ.7 వేలనుంచి రూ.10వేల వరకు ఆదా అవుతున్నది.
– సూర్యాపేట, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : సాగునీరు పుష్కలంగా ఉండడం, విద్యుత్ నిరంతరం ఇస్తుండడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం ఇవ్వడం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం పండుగలా మారింది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సూర్యాపేట జిల్లాలో ఇంచు భూమి కూడా వదలకుండా రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా దశాబ్దాల తరబడి తడికి నోచుకోని భూముల్లో నేడు వరి ధాన్యం పండిస్తున్నారు. జిల్లాలో 6లక్షల ఎకరాల వ్యవసాయ భూములకుగాను ఆరేండ్ల క్రితం వరకు 2.5లక్షలకు మించి సాగు కాకపోయేది. ప్రస్తుతం 6లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఇందులో రికార్డు స్థాయిలో 4.75 లక్షల ఎకరాల వరకు వరి సాగు చేస్తుండడం గమనార్హం. గతంలో సన్న, చిన్నకారు రైతులు తమకు ఉన్న కొద్దిపాటి భూమి సాగుకు పనికి రాకపోవడంతో కూలికి వెళ్లగా.. నేడు వారంతా తమ భూముల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. వెరసి రోజురోజుకూ కూలీల కొరత పెరుగుతున్నది.
కూలీల కొరతతో మారుతున్న పద్ధతులు
సూర్యాపేట జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగడంతో కూలీల కొరత ఏర్పడింది. దాంతో రైతులు సాగులో కొత్త విధానాలు, అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రత్యామ్నాయ పద్ధతులతో సమయం ఆదా కావడంతో పాటు ఎకరానికి రూ.7వేల నుంచి 10వేల వరకు ఖర్చు తగ్గుతుందని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. దాంతోపాటు కష్టం కూడా తగ్గుతున్నది. సాధారణంగా వరిని సాగు చేయాలంటే నాటుకు 25 రోజుల ముందు నారు పోయాల్సి ఉంటుంది. అనంతరం నాటు వేసేందుకు పడాల్సిన కష్టం అంతాఇంతా కాదు. అదే వెదజల్లుడు, డ్రమ్ సీడర్ పద్ధతిలో అయితే నారు పోసే అవసరం ఉండదు. నాటు వేసేందుకు కూలీల ఖర్చు అసలే ఉండదు. ఇద్దరు వ్యక్తులతోనే వెదజల్లుడు, డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేయవచ్చు. అలాగే పొడి దుక్కిలో సీడ్డ్రిల్ సాయంతో వరి విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేయవచ్చు. ఈ విధానాలపై రైతులు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. 2021 వానకాలంలో 2వేల ఎకరాల్లో వెదజల్లుడు, డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగు చేయగా.. 2022లో 18వేల ఎకరాలకు పైగా వెదజల్లుడు, 12వేలకు పైగా ఎకరాల్లో డ్రమ్ సీడర్ వినియోగించారు. ఈ సారి 48వేల ఎకరాలకు పైగా వెదజల్లుడు, 35వేలకు పైగా ఎకరాల్లో డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగు చేస్తున్నారు.
అధునాతన పద్ధతులు పెరుగుతున్నాయి
వరి సాగులో నూతన పద్ధతులు అవలంబించే రైతులకు సమయంతోపాటు ఖర్చు ఆదా అవుతుంది. దీనికితోడు రైతుకు నారు పోసి, దానిని పీకి నాటు వేసే కష్టం తప్పుతుంది. అవకాశం ఉన్నంత వరకు రైతులు పంట మార్పిడి చేయాలి. వరి సాగు చేసేవారు వెదజల్లుడు, డ్రమ్ సీడర్, ఇతర పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
– రామారావునాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట