ఈ ఫొటోలోని రైతు పేరు దొండ నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. గతంలో ఎస్బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు రూ.45 వేల వడ్డీ పెరిగింది. అసలు, అప్పు కలిపి రూ.1.95 లక్షలు పెండింగ్‌లో ఉంది. 4.05 ఎకరాల భూమి ఉండటంతో రూ.25 వేల రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ అయ్యాయి. డ్రా చేసుకుందామంటే రావడంలేదు. బ్యాంకు అధికారులు మాత్రం రుణాలు చెల్లించి.. రైతు భరోసా డబ్బులు తీసుకెళ్లాని చెబుతున్నారని రైతు వాపోయారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులను బ్యాంకులు కొర్రీలు పెడుతూ మరింత గోస పెడుతున్నాయి. సర్కారు ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకుండా మోకాలడ్డుతున్నాయి. తీసుకున్న రుణం చెల్లించలేదంటూ డబ్బులను హోల్డ్‌లో పెడుతున్నాయి. ఫలితంగా రైతులు డబ్బులు డ్రా చేసుకోలేని పరిస్థితి దాపురించింది.
బాధితులు డబ్బుల కోసం బ్యాంకులకు క్యూ కడుతూ.. తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సీజన్లో 2.84 లక్షల మంది రైతులకు రూ. 317 కోట్లు జమ చేయాలని వ్యవసాయ అధికారులు ప్రతిపాదించారు.
ఇప్పటి వరకు 2.33 లక్షల మంది రైతులకు రూ. 306 కోట్ల డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశారు. పెట్టుబడి సాయం కోసం కొందరు రైతులు డబ్బులు డ్రా చేసుకోగా.. మరికొంత మందికి మాత్రం డ్రా కావడం లేదు. రైతులు డబ్బులు తీసుకోకుండా బ్యాంకు అధికారులు ఆయా ఖాతాలను ఫ్రీజింగ్లో పెట్టారు. జిల్లాలో వేలాది మంది ఖాతాలు హోల్డ్‌లో పెట్టారు. దీంతో అనేక మంది రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పైసలు ఎందుకు రావడంలేదంటూ ఆరా తీస్తూ.. నిరాశగా వెనుదిరిగిపోతున్నారు. అందరికీ వచ్చి తమకు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
రుణమాఫీ కాక.. భరోసా డబ్బులు రాక..
జిల్లాలో నాలుగు దఫాల్లో 80,982 మందికి రుణ మాఫీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. రుణమాఫీలో సర్కారు అనేక కొర్రీలు పెట్టింది. రేషన్ కార్డు, ఇంటికి ఒకరు తదితర కారణాలతో మాఫీని నిలిపేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అర్హుల జాబితాలో పేర్లున్నా కూడా మాఫీ కాలేదు. రూ.రెండు లక్షలలోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పై డబ్బును రైతులు చెల్లిసేన్తే రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామంది. దీంతో మాఫీకి అర్హత పొందేందుకు రైతులు ప్రైవేట్‌లో రెండు, మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో మిగిలిన మొత్తాన్ని క్లియర్ చేశారు.
ఇలా రూ. 20 వేల నుంచి రూ.లక్ష వరకు బయట బాకీలకు తెచ్చి చెల్లించారు. అయినా రుణమాఫీ కాలేదు. జిల్లాలో 17 వేల మందికి మాఫీ కాకపోవడంతో అప్పట్లో రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఇప్పుడు వీరందరికీ రైతు భరోసా జమ అయినా డబ్బులు తీసుకోలేని దుస్థితి నెలకొంది. అన్నీ అర్హతలున్నా అటు రుణమాఫీ కాక.. ఇటు రైతు భరోసా డబ్బులు తీసుకోలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.
మళ్లీ అప్పులే దిక్కు..
రైతు భరోసా డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో పెట్టుబడి సాయానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విత్తనాలు, దుక్కులు, మందులు తదితర అవసరాల కోసం అరిగోస పడుతున్నారు. చేసేదేం లేక బయట ప్రైవేట్‌లో రెండు రూపాయల మిత్తికి తీసుకుంటున్నారు. ఆ డబ్బులతో సాగు పనులు చేపడుతున్నారు. దీంతో పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ పడగ విప్పుతోంది. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.