నకిరేకల్, జూన్ 24 ః నకిరేకల్ మండలం చందుపట్ల రైతువేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు భరోసా సంబురాల్లో జిల్లా అధికారులైన కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి సాక్షిగా అన్నదాతకు అవమానం జరిగింది. ఖాతాలో పడిన రైతు భరోసా సొమ్మును బ్యాంకు వారు జప్తు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను అడుగుదామని వెళ్తున్న ఓ రైతును కలెక్టర్ సెక్యూరిటీ సిబ్బంది, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు లాక్కెళ్తున్నా జిల్లా అధికారులు స్పందించలేదు.
పైగా హడావుడిగా అధికారులు రైతు వివరాలు కనుక్కొని బ్యాంకుకు ఫోన్ చేసి రేపు డబ్బులు తెచ్చుకోమని అక్కడి నుంచి పంపించేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభంలో రైతువేదికపై ఉన్న మైకు మొరాయించింది. దీంతో వెనుక కూర్చున్న రైతులకు సీఎం ప్రసంగం వినబడకపోవడంతో ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్లిన రైతులను పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది బతిమిలాడి తీసుకొచ్చి కూర్చొబెట్టారు.
జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రసంగిస్తున్న సమయంలో జిల్లా స్థాయి అధికారులు ఉన్నా రైతులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. రైతు వేదిక వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో రావాలని అధికారులు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. సంబురాల కార్యక్రమానికి 30 మంది రైతులు కూడా రాకపోవడం గమనార్హం. హాల్ నిండా అధికారులే కూర్చున్న పరిస్థితి కనిపించింది.
వ్యవసాయశాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే కార్యక్రమం విఫలమైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా రైతులు తమ గోడును కలెక్టర్‌కు చెప్పుకుందామన్నా ఆమెను కలువనివ్వకపోవడం సరికాదని పలువురు రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అసహనానికి గురైన కొందరు రైతులు సీఎం ప్రసంగం వినకుండా వెళ్లిపోయారు.