నల్లగొండ ప్రతినిధి, ఏఫ్రిల్7(నమస్తే తెలంగాణ): సందు దొరికితే చాలు.. సన్నధాన్యం రైతును నిలువు దోపి డీ చేసేందుకు రైసు మిల్లర్లు కుట్ర చేస్తున్నారు. ఆరంభంలో మంచి ధర పెట్టి తీరా ధాన్యం ట్రాక్టర్లు బారు లు తీరే సమయంలో ధరను అంతకంతకూ తగ్గించి వేస్తున్నారు. సాగర్ ఆయకట్టుతో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరం కావడంతో మిర్యాలగూడ ప్రాంత మిల్లులకు పెద్ద ఎత్తున ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని రైసు మిల్లర్లు రైతులను దగా చేస్తున్నారు. ధాన్యం అమ్ముకోవాలన్న రైతన్న ఆతృతను ఆసరాగా చేసుకొని పచ్చగింజ, తాలు తదితర కారణాలతో ధాన్యం కొనుగోళ్లను తిరస్కరిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులను అసలు ధాన్యమే కొనబోమని బెదిరిస్తున్నారు.
ఇలా అదిరించి బెదిరించి మొత్తానికి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పరిస్థితిని చక్కదిద్ది అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో రైతులు నిత్యం రోడ్లెక్కుతున్నారు. యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సాగర్ ఆయకట్టుతో పాటు ఏఎంఆర్పీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో సన్నాలు సాగు చేసిన రైతులంతా పండించిన ధాన్యాన్ని మిర్యాలగూడ ప్రాంత రైసు మిల్లుల్లో అమ్ముకోవడం పరిపాటి. ఇరవై రోజులుగా ధాన్యం రాక మొదలు కాగా గత వారం రోజులుగా ధాన్యం పెద్ద మొత్తంలో తరలివస్తోంది. దీంతో మిర్యాలగూడ పరిధిలోని 90కి పైగా రైసుమిల్లుల వద్ద నిత్యం వందలాది ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి.
కొద్దీ రోజులుగా రోజూ సగటున 1500 ట్రాక్టర్లకు పైగా ధాన్యం లోడ్లు వస్తున్నట్లు అంచనా. అయితే ప్రారంభంలో పక్షం రోజులు వరకు క్వింటాల్‌కు రూ.2550 నుంచి రూ.2750 వరకు ధర చెల్లించారు. ఇక ధాన్యం రాక ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో రైతుల ఆతృతను ఆసరాగా చేసుకొని మిల్లర్లు సిండికేట్‌గా మారారు. గరిష్టంగా రూ.2500కు మించి ధర పెట్టడం లేదు. పచ్చగింజ, తాలు సాకుతో రూ.2 200 వరకు ధర చెల్లిస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర(రూ.2389) కంటే కూడా తక్కు వే కావడం గమనార్హం. వాస్తవంగా సన్నవడ్లకు మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ కూడా లభించాల్సి ఉంది. కానీ మిల్లర్లకు అమ్ముకోవడం వల్ల బోనస్ ఎలా గూ రాకపోగా అసలు ధరకే మిల్లర్లు ఎసరు పెడుతుం డడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

రూ.2,500లకు మించని ధర..
మంగళవారం రైతుల ఆందోళన అనంతరం రైసు మిల్ల ర్లు సిండికేట్‌గా మారడంతో ఏ మిల్లు వద్దకు వెళ్లినా క్వింటాల్‌కు రూ.2500కు మించి ధర రాలేదు. రూ.2 200 నుంచి గరిష్టంగా ఒకటీరెండు చోట్ల మాత్రం రూ. 2,550 ధర పెట్టారు. ఈ సీజన్లో ఒక్క రోజులో ఇదే గరిష్టంగా లభించిన కనిష్ట ధర కావడం గమనార్హం. తెల్లవారుజాము నుంచే తిండితిప్పలు మాని వచ్చిన రైతులు ధాన్యం లోడ్లతో ఎదురుచూస్తున్నారు. మధ్యా హ్నం వరకు కొనుగోళ్లు జరగకపోవడంతో రైతుల్లో ఎట్లనో అమ్ముకోవాలన్న ఆతృత కనిపించింది.
దీన్ని ఆసరాగా తీసుకున్న మిల్లర్లు గరిష్ట ధరను పెంచలేదు. దీంతో రైతులు సైతం వేచి ఉంటే ట్రాక్టర్ల కిరాయి, ఇతర ఖర్చులు మీద పడతాయన్న భయంతో మిల్లర్లు చెప్పిన ధరకే అమ్ముకోవడం కనిపించింది. ఎలా వీలైతే అలా రైసు మిల్లర్లు సన్నాల రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై నిరంతరం నిఘా పెట్టాల్సిన జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడ టం లేదు. నేటికీ జిల్లా మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై కనీస సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లెక్కుతున్న రైతన్న..
ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోపాటు కుంటిసాకులతో ధరను భారీగా తగ్గిస్తుండటంతో మిర్యాలగూడ ప్రాంతంలో నిత్యం రైతులు ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం సాయంత్రం యాద్గార్పల్లి శివారులోని ఓ రైసుమిల్లు వద్ద పలువురి రైతుల ధాన్యాన్ని పచ్చగింజ పేరుతో ఓ మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. గుమస్తాలు ధాన్యాన్ని చెక్ చేస్తూ తీసుకోబోమని చెప్పడంతో.. రైతులు నిలదీశారు. దీంతో మిల్లు సిబ్బంది రైతులతో వాదనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకొని మిల్లర్లంతా సిండికేట్‌గా మారి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ మంగళవారం మిల్లులను తెరవలేదు.
అప్పటికే వందలాది ట్రాక్టర్లు మిల్లుల వద్ద బారులు తీరాయి. ఏ మిల్లు వద్దకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపించింది. అధికారులు సైతం అటూ వైపూ తొంగిచూడలేదు. దీంతో అర్ధరాత్రి నుంచే మిల్లుల వద్దకు చేరుకున్న రైతులు ఆగ్రహంతో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రెండు గంటలకు పైగా రవాణాను స్తంభింపచేశారు. దీంతో అధికారులు స్పందించక తప్పలేదు. మిల్లర్లతో చర్చించిన అనంతరం రైతులతో చర్చించడంతో సమస్య సద్దుమణిగింది. అయితే ఉదయం నుంచి వేచిచూస్తున్న రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఇదే అదనుగా మిల్లర్లు మాత్రం ధరను మరింత తగ్గించి వేశారు.