హనుమకొండ, ఆగస్టు 18 : ‘మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడే కాదు.. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడు.. మెడికల్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అగ్రశేణి నాయకుడు.. పెద్ది విగ్రహం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తొలగించిన చోటే ప్రభుత్వ ఖర్చులతో విగ్రహం ప్రతిష్ఠించాలి’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి డిమాం డ్ చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ద సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ తుగ్లక్, ఉన్మాద నిర్ణయమని విమర్శించారు. విగ్రహ తొలగింపును నిరసిస్తూ నర్సంపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆందోళనకు సిద్ధమైన వేలాది మంది కార్యకర్తలు, నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆణచివేయలేరని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన ముగిసిన తర్వాతే ప్రభుత్వం పెద్ది విగ్రహ తొలగింపు నిర్ణయాన్ని అమలు చేసిందన్నారు.
ఒకవేళ పర్యటనకు ముందే ఇలా చేస్తే జిల్లా అంతా భగ్గుమంటుందనే భయం వారిలో ఉందని వ్యాఖ్యానించారు. పెద్దికి ఉన్న ప్రజాదరణ రేవంత్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నదన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులు పాలన సాగిస్తూ, తెలంగాణ అస్తిత్వాన్ని, బిడ్డల ప్రాధాన్యతను కాలరాస్తున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడడం రాజకీయ జీవితంలోనే అతిపెద్ద జోక్ అని విమర్శించారు. ఎన్నకల మ్యానిఫెస్టోలో బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు తీసుకురాలేదన్నారు. ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. సీఎం మాటలకు, చేతలకు పొంతనే లేదన్నారు. ఇటీవల రాజ్యసభ సీటును సీనియర్ బీసీ నాయకుడు హనుమంతరావుకు ఇస్తారని భావించినప్పటికీ, మరో సామాజిక వర్గానికి కేటాయించారని విమర్శించారు.
పార్టీలు మారి వచ్చిన రేవంత్ భట్టి విక్రమార, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, హనుమంతరావు, మధు యాషి, దామోదర రాజనర్సింహ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను పకనపెట్టి తానే అందరికీ పదవులిస్తున్నానని చెప్పడం వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనన్నారు. సీఎం బీజేపీ హైకమాండ్‌తో అంటకాగుతూనే పరకాలలో విమర్శలు చేశాడని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 8 లక్షల కోట్లు అని అబద్ధాలు చెబుతున్నారని, నిజానికి సీఏజీ, ఆర్బీఐ నివేదికల ప్రకారం రాష్ట్ర అప్పులు రూ. 4,17,000 కోట్లు మాత్రమేనన్నారు. పెద్ది విగ్రహం తొలగింపు, సామాజిక న్యాయం విషయాల్లో ద్రోహం చేసిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల ని సిరికొండ డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ నాయకులు జనార్దన్‌గౌడ్, మేడిపల్లి శోభన్, శ్రీధర్, వీపీ రెడ్డి, చల్వాజి రవీందర్రావు, శ్రీధర్ పాల్గొన్నారు.
కక్ష సాధింపు చర్యే : దాస్యం
కక్ష సాధింపు చర్యలో భాగంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదు. ప్రతీకార పాలన. చనిపోయిన వ్యక్తులను కూడా వదిలి పెట్ట కుండా రాక్షసానందం పొందుతున్నారు. ఓర్వలేక అధికారులతో రాత్రికి రాత్రి విగ్రహాన్ని కూలగొట్టించారు. నిరసన తెలియజేస్తుంటే ఎకడికకడ నిర్బంధిస్తున్నారు. పెద్ది విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ప్రజల మనసుల నుండి ఆయనను దూరం చేయలేరు.
ప్రతి గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేస్తాం : నన్నపునేని
గ్రామ గ్రామాన పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆయన ప్రజల మనిషి. ఉద్యమంలో అసువులు బాసిన ప్రతి కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం ఇచ్చాడు. అలాంటి ప్రజా నేత విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి. ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వందలాది మంది పోలీసులతో కూల్చడం హేయం.
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : తాటికొండ
స్టేషన్‌ఘన్‌పూర్ : ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతి పక్షం గొంతును కాంగ్రెస్ సర్కారు నొక్కుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసనకు కూడా స్థానం లేకుండా ముందస్తు అరె స్టులు చేయడం ఎంతవరకు సమంజసం. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం కంటే, విగ్ర హం కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
విగ్రహం ఏర్పాటు చేయాలి : చల్లా
తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏకం చేసి, మాజీ సీఎం కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఆయన ఆకస్మిక మరణం తర్వాత నర్సంపేట ప్రజలు అభిమానంతో పెట్టుకున్న విగ్రహాన్ని తొలగించి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శాంతిభద్ర తలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. తక్షణమే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
ఇదేనా ప్రజాస్వామ్యం : నాగుర్ల
ఉద్యమకారుల గొంతు నొకేలా ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరు ద్ధం. రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన పెద్ది విగ్రహాన్ని పోలీసు బలగాలను మోహ రించి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందస్తు అరెస్టుల పేరుతో ఉద్యమకారులను అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్య. పెద్ది విగ్రహాన్ని ఎందుకు తొలగించారో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిరసన తెలిపే హకును కాలరాయడం సరికాదు.
వాటర్‌ట్యాంక్ ఎక్కిన బీఆర్ఎస్ కార్యకర్తలు
నల్లబెల్లి : పెద్ది విగ్రహాన్ని పోలీసులు తొలగించడాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కార్యకర్తలు నల్లబెల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అల్లె రజనీకాంత్, అనిల్, బొట్ల పెద్దనరేశ్ విగ్రహాన్ని తొలగించిన చోటనే నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంకు ఎక్కి దూకి చస్తామంటూ నినదించారు. స్థానిక ఎస్సై సాయిప్రసన్నకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని నచ్చచెప్పడంతో యువకులు ట్యాంకు దిగారు.