కోదాడ రూరల్, సెప్టెంబర్17 : వానలు, వరదకు పంటలు మునిగింది గోరంత అయితే, కాల్వలకు నీళ్లు రాక ఎండుతున్నవి కొండంత అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సాగర్ ఎడమ కాల్వకు గండ్లు పడి 14 రోజులు కావస్తున్నా నేటికీ పనులు ప్రారంభించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కాల్వకు నీటి విడుదల లేక వేలాది ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ మండలం గణపవరం, తొగర్రాయి, బీక్యాతండా, ఎర్రవరం, రామలక్ష్మిపురం గ్రామాల్లో మంగళవారం ఆయన నీళ్లు లేక ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు ప్రజా సమస్యలను గాలికి వదలేసి కార్లలో షికార్లు చేస్తున్నారని విమర్శించారు.
గండ్లు పూడ్చడానికి టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని, సాగర్ నిండా నీళ్లు ఉన్నా పంటలను బతికించుకోలేని పరిస్థితిలో రైతాంగం ఉన్నదని తెలిపారు. గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చి నీటి విడుదలకు చర్యలు తీసుకోకుంటే ప్రజా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే ఉద్దండు, మాజీ సర్పంచులు పొట్ట విజయకిరణ్, దొంగల లక్ష్మీనారాయణ, అన్నెం వెంకట్‌రెడ్డి, అమరబోయిన శ్రీనివాస్‌యాదవ్, గంటా శ్రీనివాస్, పోశం పూర్ణయ్య, కత్తి వెంకటేశ్వరావు, కత్తి రంగారావు, రైతులు పాల్గొన్నారు.
అనంతగిరి : సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు రాక ఎండుతున్న అనంతగిరి మండలంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పర్యటించారు. నీటి పారుదల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. వారంలో గండి పూడుస్తామని చెప్పిన ఉత్తమ్ 14 రోజులైనా మాట నిలబెట్టుకోలేక పోయారని దుయ్యబట్టారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్లా భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు గండూరి సంతోష్, మట్టపల్లి సైదులు, ప్రసాద్, శ్రీనివాస్, కమల్ ఉన్నారు.