– పీఏసీఎస్ వద్ద అధికారులు, రైతుల మధ్య వాగ్వివాదం
– ఓ రైతుకు తీవ్ర గాయం
కట్టంగూర్, ఆగస్టు 25 : రైతన్నను రోజురోజుకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పొద్దస్తమానం పడిగాపులు పడ్డా ఒక్క బస్తా యూరియా దొరకడం లేదు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు 443 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న పలు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తెల్లవారుజామునే పీఏసీఎస్ వద్దకు వచ్చి పాస్ బుక్ జీరాక్స్ లు సీరియల్ పెట్టి క్యూలో ఉన్నారు. మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసుల వహారాలో సింగిల్ విండో, వ్యవసాయ శాఖ సిబ్బంది సీరియల్ ప్రకారం యూరియా రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఆ సమయంలో రైతులు ఒక్కసారిగా గోదాంలోకి దూసుకుపోవడంతో గందరళగోళం నెలకొంది. సీరియల్ ప్రకారం యూరియా పంపిణీ చేయకుండా తమ ఇష్టం వచ్చిన వారికి ఇస్తున్నారని అధికారులు, పోలీసులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో ఓ రైతు కోపంతో టేబుల్ ను విసరడంతో బొల్లెద్దు నర్సయ్య అనే రైతు కాలుకు తగిలి తీవ్రగాయమైంది. అనంతరం ఎస్ఐ మునుగోటి రవీందర్ తన సిబ్బందితో కలిసి ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. దొరకని రైతులు ఉత్తి చేతులతో వెనుదిరిగారు. రోజంతా క్యూలో ఉన్నా ఒక్క బస్తా కూడా దొరకలేదని పలవురు రైతులు వాపోయారు.
Kattangur : కట్టంగూర్‌లో యూరియా కోసం రైతుల కష్టాలు