నల్లగొండ, ఆగస్టు 21: ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం..ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం వల్ల నే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందనే విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సీజన్లోనూ కేటాయింపులు సరిపోను ఉన్నప్పటికీ అధికారులను ముందుగా అప్రమత్తం చేయటంలో సర్కార్ విఫలమైనందునే పక్షం రోజుల కింద పాక్షికంగా కనిపించిన యూరియా కొరత ప్రస్తుతం తీవ్రమైంది. జిల్లాలో ఈ ఏడాది 10.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 9.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
అయితే ఈ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడగా, ఇప్పటి వరకు 45వేల మెట్రిక్ టన్నుల మాత్రమే వచ్చింది. ఈ నెలాఖరులోగా మరో ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా రానుండగా వచ్చే నెలలో మొ త్తం కోటాలో భాగంగా మరో 20 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. అయితే ఇప్పటికే పంటల సాగు పూర్తయి, రైతులు యూరియా వేస్తున్నందున వచ్చే నెలలో వచ్చే 20 వేల మెట్రిక్ టన్నులు పూర్తిగా అవసరం పడదని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
అవసరం ఉన్నప్పుడు అందని యూరియా..
రైతులకు వానకాల సీజన్లో ప్రధానంగా జూలై, ఆగస్టు నెలల్లో పంటల ఎదుగుదలకు యూరియా అవసరం ఉంటుంది. సెప్టెంబర్‌లో అప్పటికే పంటలు చివరి దశకు వస్తుండటం వల్ల పెద్దగా అవసరం ఉండదు. అయితే ఈ రెండు నెలల్లో యూరియా పెద్ద ఎత్తున అవసరం ఉన్నప్పటికీ అవసరం ఉన్న మేరకు ప్రభుత్వం జిల్లాకు యూరియా ఇవ్వటంలో విఫలమైంది.
యూరి యా విషయాన్ని సీరియస్‌గా తీసుకొని కనీసం రివ్యూ కూడా చేయకపోవటంతో పాటు కేంద్రం నుంచి యూరియాను తెప్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందునే ఈ సమస్య వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో యూరియా సమస్య తీవ్రం కావడం తో నిన్న, మొన్న వచ్చిన 1000 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేసేందుకు రైతులు నిద్రాహారాలు మాని శ్రమించాల్సి వస్తోంది. కుటుంబం మొత్తం పీఏసీఎస్‌ల వద్ద క్యూల్లో నిలబడి ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పది రోజులుగా ఒక్క బస్తా కూడా రాకపోవటంతో…
రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన నల్లగొండకు ప్రతి రోజూ యూరియా ర్యాక్స్ వస్తేనే సమస్య తీరే అవకాశం ఉంటుంది. ఈనెల 10వ తేదీ నుంచి రెండు రోజులకోసారి ఒక ర్యాక్ రావటంతో యూరియా సమస్య మొదలైంది. 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక్క ర్యాక్ కూడా రాలేదు. ప్రధానంగా ఈ పది రోజుల్లోనే పంటలకు యూరియా అవసరం ఎక్కువ ఉంటుంది. దీంతో రైతులు నిత్యం విక్రయ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు.
జిల్లాకు 70 వేల యూరియా కోటా ఉండగా ప్రతి ఏటా ఆగస్టు నాటికి 90 శాతానికి పైగా రావటంతో గతంలో పెద్దగా సమస్య కనిపించేది కాదు. ఈ కోటాలో ఈ నెలలో మరో ఐదువేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంటే కోటాలో 70శాతం మాత్రమే ఈ నెలాఖరు వరకు పూర్తి కానుంది. వచ్చే నెలలో ఇంకా 30శాతం ఎరువులు రానున్నాయి. అయితే అవసరం లేని సమయంలో వస్తే ఏం ఫాయిదా అంటూ రైతులు నిట్టూరుస్తున్నారు.
పొద్దు పొద్దునే పరుగులు..!
నల్లగొండ రూరల్,ఆగస్టు 21: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం యూరియా కోసం రోడ్డెక్కి పెద్దఎత్తున ధర్నా చేసిన విషయం విదితమే. దీంతో అధికారులు 40 టన్నుల యూరియా వస్తుందని చెప్పి పోలీసులు, ఏఈవోల సమక్షంలో రైతులు పేర్లు రాసుకోవడంతో రైతులు పడిగాపులు గాశారు. రాత్రి వరకు యూ రియా రాకపోవడంతో నిరాశతో ఇంటి దారి పట్టారు. నల్లగొండలోని గుండ్ల పల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆగ్రోస్ కేంద్రానికి కేవలం 300 బస్తాల యూరియా మాత్రమే రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయితే అక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా దక్కకపోవడంతో వెనుదిరిగారు. ఆ యూరియా ను కూడా ఏఈవో, పోలీసుల పహారాలో అందించాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తపల్లిలో ఎన్డీసీఎమ్మెస్, ఆగ్రో ఏజెన్సీలకు కలిపి 300 బస్తాలు వచ్చాయి. అక్కడ కూడా రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
బస్తా యూరియా కోసం రోజంతా నిరీక్షణ
కట్టంగూర్, ఆగస్టు 21: మండలంలో యూరి యా కొరత తీవ్రమవుతోంది. రైతులు తిండితిప్పలు మాని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. గురువారం పీఏసీఎస్ కార్యాలయం వద్దకు లారీ లోడు (330 బస్తాలు) యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రైతులు తమ పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టి గంటల కొద్దీ నిరీక్షించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పోలీసుల పర్యవేక్షణలో ఒక్కో రైతుకు బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. అప్పటికీ చాలా మంది రైతులకు యూరియా దొరక్క పోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు.
యూరియా కోసం తప్పని పడిగాపులు
నార్కట్‌పల్లి ఆగస్టు 21: నార్కట్‌పల్లి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ సంఘం కా ర్యాలయం వద్ద గురువారం యూరియా కో సం రైతులు పడిగాపులుకాశారు. ప్రస్తుతం యూరియా అవసరం బాగా ఉన్నందున రైతులు ఎరువుల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర యూరియా సరిపోక రైతులు ప్రైవేటు దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. అదునుగా ఉన్న సమయంలో యూరియా వేయకుంటే నష్టపోతామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.
వెనుకటి రోజులు మళ్లీ వచ్చాయ్..!
హాలియా, ఆగస్టు 21: యూరియా కోసం అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాల రైతులు హాలియాలోని కొత్తపల్లి సహకార సంఘ కార్యాలయం ఎదు ట బారులుదీరారు. స్టాక్ లేనందున 12 రోజులుగా కొత్తపల్లి సహకార సంఘం కా ర్యాలయంలో యూరియా అమ్మకం నిలిపివేశారు. దీంతో రైతులు యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గురువారం కొత్తపల్లి సహకార సంఘానికి లోడు (20 టన్నులు..అంటే 444 బస్తాలు) రావడంతో వందలాదిమంది రైతులు క్యూకట్టారు.
ఉదయం 8గంటల సమయంలో 60 మంది రైతులు ఉండటంతో ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. విషయం తెలిసిన గంటలోనే 5 వందల మంది రైతులు రావడంతో సిబ్బంది పోలీసులను కాపలా పెట్టి ఒక్కో బస్తా చొప్పున విక్రయించారు. దీంతో తోపులాట జరిగి, పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు కూడా చేసేదేమీలేక చేతులెత్తేయడంతో కొద్దిసేపు అమ్మకం నిలిపివేశారు. తరువాత మిగిలిన 60 బస్తాలను రైతులకు విక్రయించారు.