కట్టంగూర్, సెప్టెంబర్ 06 : యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేస్తే సకాలంలో యూరియా అందపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్ కు గురువారం రెండు లారీలు 888 బస్తాల యూరియా వచ్చింది. శుక్రవారం సెలవు కావడంతో పంపిణీ చేయలేదు. ఒకే దగ్గర టోకెన్లు, యూరియా పంపిణీ చేయడంతో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టోకెన్ల పంపిణీని రైతు వేదిక వద్దకు మార్చారు. దీంతో రైతు వేదిక వద్ద క్యూలో ఉన్న 444 మంది రైతులకు సీరియల్ ప్రకారం అధికారులు టోకెన్లు అందజేశారు.
టోకెన్లు తీసుకున్న రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకుని మళ్లీ అక్కడ క్యూలో నిల్చున్నారు. పది గంటల తర్వాత వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, సీఈఓ మల్లారెడ్డి పర్యవేక్షణలో పోలీసుల పహారాలో ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పున సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేశారు. సోమవారం మరో రెండు లారీల యూరియా వస్తుందని అధికారులు తెలుపడంతో యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగారు. సోమవారానికి కూడా 100 మంది రైతులకు టోకెన్లు అందజేశామని రైతులు సహకరించాలని ఏఓ గిరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
Kattangur : గంటల కొద్ది క్యూలో రైతుల పడిగాపులు