శాలిగౌరారం, అక్టోబర్ 16 : రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరుబయట ఆరబోసుకుని తాలు, గడ్డి లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండలంలోని అడ్లూరు, తుడిమిడి గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వాహకులు సైతం సమన్వయం పాటించాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీ, కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పీడీ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి, తాసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, పీఏసీఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు, ఏపీఎం శంకరయ్య పాల్గొన్నారు.