కోదాడ, జూలై 03 : ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడడంతో వానాకాలం సీజన్ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పార సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. నీటి నిర్వహణ అత్యంత కీలకమని దేశంలో జూన్ నెలలో 40 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. తెలంగాణలో జూన్ నెలలో 22 శాతం వర్షపాతం లోటు ఉందని, విత్తనాల విత్తడం ఆలస్యమవుతుందన్నారు. మహారాష్ట్రలోనూ తక్కువ వర్షాలు ఉన్నందున గోదావరి జలాల ప్రవాహం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలు ఎంచుకోవాలన్నారు.
ఎండలను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. రిజర్వాయర్లలోని నీటిని అత్యంత సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. వర్షపాతం, జలాశయాల నీటి నిల్వలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని పరిస్థితులకు అనుగుణంగా రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ అంశంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సరైన ప్రణాళిక, నీటి పొదుపుతో ఎల్‌నినో సవాళ్లను అధిగమిద్దాం అన్నారు. ఏడు రకాల సన్నాలకు బోనస్ అందజేస్తామని తెలిపారు.