చండూరు, ఏప్రిల్ 07 : రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మావెంకన్న అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాలలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతు వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చేప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, భూమి పాస్ పుస్తకం తీసుకురావాలన్నారు. తేమ 17 శాతం లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే రైతులు తమ ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ తప్పకుండా లింక్ చేసుకుని ఉండాలన్నారు. అదే విధంగా రైతులు తమ పంట నమోదు వరి అని ఉన్నదో లేదో తమ AEO వద్ద సరిచూసుకోవాలన్నారు.
రైతులు తమ వడ్లను దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ – Aకు రూ.2,302/-, గ్రేడ్ – B కు రూ.2,300/- పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ జ్యోతిర్మయి, ఎంపీడీఓ బండారు యాదగిరి, డీటీ నిర్మల, ఏఓ చంద్రిక, ఏఈఓ భార్గవి, సంఘ డైరెక్టర్లు కట్ట భిక్షం, మొగుదాల దశరథ, బనావత్ ఘాంసి రామ్, సంఘ సెక్రటరీ పాల్వాయి అమరేందర్ రెడ్డి, పి.పి.సి ఇన్చార్జి భూతరాజు ఫణీంద్రకుమార్, మాజీ ఎంపీటీసీ నాతాల వనజ, విష్ణువర్ధన్, మాజీ ఉప సర్పంచ్ ఉరుగుండ్ల వెంకన్న, పంగ రామకృష్ణ, పందిరి రాధ, మేకల సాగర్ రెడ్డి పాల్గొన్నారు.