నల్లగొండ సిటీ, అక్టోబర్ 14 : రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కనగల్ మండలం, దోరేపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. దొరేపల్లి కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చేందుకు అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రానికి విశాలమైన స్థలాన్ని చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు వారి కళ్ళంలోనే ధాన్యాన్ని ఆరబెట్టి ఎలాంటి తాలు, తరుగు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలన్నారు.
రైతులు అకాల వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్ష సూచన ఉన్నందున ప్రతిరోజు ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. తగినంత తేమ శాతం వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్వాహకులు ప్రతిరోజు తేమ శాతం వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సీరియల్ నంబర్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, తేమ ఎక్కువగా లేకుండా ధాన్యాన్ని కొనాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, తాసీల్దార్ పద్మ ఉన్నారు.