గట్టుప్పల్, మార్చి 11 : విద్యుత్ లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని కోరుతూ గట్టుప్పల్ మండల రైతులు పలువురు మంగళవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. లో ఓల్టేజీ సమస్య వల్ల పంటలు ఎండిపోతున్నట్లు తెలిపారు. వారి నుంచి వినతిపత్రం తీసుకున్న ఎమ్మెల్యే వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా కాపాడాలని విద్యుత్ అధికారులకు తెలిపారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వారీగా ఎక్కడెక్కడ లో ఓల్టేజీ సమస్యలు ఉన్నాయనే పూర్తి సమాచారం స్థానిక నాయకుల ద్వారా సేకరించి సత్వరమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.