పెద్దవూర, సెప్టెంబర్ 23: పెద్దవూరలోని పీఏసీఎస్ భవనంలో యూరియా ఇస్తున్నారనే సమాచారంతో సమీప గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. రైతులు రేయింబవళ్లు దుకాణాలు, పీఏసీఎస్ వద్ద బారులు తీరుతున్నారు. కాగా ఫర్టిలైజర్ దుకాణాదారులు యూరియాను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారని, బస్తా రూ.480కు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రైతన్నపై చేయి చేసుకున్న కానిస్టేబుల్..
మండల కేంద్రంలో మంగళవార పీఏసీఎస్ భవనం ముందు క్యూలో నిలబడిన రైతుపై ఓ కానిస్టేబుల్ చేయి చేసుకోవడం విస్మయా న్ని కలిగించింది. క్యూలో తొక్కిసలాట జరగడంతో మరో ముగ్గురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. రోజుల తరబడి యూరియా కోసం క్యూలో నిలబడుతున్నామని, తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లో నిలబడి తిండి కూడా తినలేక పోతున్నామని, పరిస్థితి ఇలా ఉంటే పోలీసులు తమపై చేయి చేసుకుంటే ఎవరికి చెప్పుకోవాలని రైతులు వాపోతున్నారు.
రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు..
మేళ్లచెర్వు, సెప్టెంబర్ 23 : యూరియా కోసం రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఎరువుల కోసం సహకార సంఘాల ఎదుట తెల్లవారు జామునుంచే లైనులో నిలబడాల్సిన పరిస్థితి ఉండటంతో ..ఇప్పటి వరకు రైతులు సాధారణంగా చెప్పులు, రాళ్లు, ఆధార్ కార్డు జీరాక్స్ కాపీలను వరుసలో పెట్టేవారు. అయితే మేళ్లచెర్వు మండల కేంద్రంలో మాత్రం రైతులు మంగళవారం కండువాలను వరుస క్రమంలో పెట్టి తమ వంతు కోసం పడిగాపులు కాశారు.
రోడ్ల వెంటే భోజనాలు
త్రిపురారం, సెప్టెంబర్ 23: తెల్లవారుజాము నుంచే త్రిపురారం మండల కేంద్రానికి పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు వరుస క్రమంలో చెప్పులు పెట్టి ఆరుబయట నిద్రిస్తున్నారు. ఎం తసేపటికీ ట్యాగ్ నంబర్ రాలేదని, ట్యాగ్ నెం బర్ వచ్చిన తరువాతే టోకెన్లు రాస్తామని రైతులను ఉదయం 11గంటల వరకు అలాగే నిల్చొబెట్టారు. రైతులు నిలదీయడంతో ఒక్కో రైతుకు ఒక కట్ట చొప్పున అందించారు. అయి తే మిగతా సగం మంది రైతులకు ఒక్క కట్ట కూడా అందకపోవడంతో నిరుత్సాహం తో వెనుదిరిగి వెళ్లారు. అర్ధరాత్రి వచ్చి క్యూలో నిలబడి ఆకలితో అలమటిస్తున్న రైతులకు మహిళా రైతులు ఇంటి నుంచి తెచ్చిన అన్నా న్ని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న ప్రహరీ వెంట నిల్చోని తినడం కనిపించింది. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్యా తండా నుంచి అర్ధరాత్రి 2గంటలకే వచ్చి ఇక్కడ అవస్థలు పడతున్నామని, తమ ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.
నెమ్మికల్‌లో రైతుల రాస్తారోకో..
ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 23: మండలంలోని నెమ్మికల్‌లోని మన గ్రోమోర్ యూరియా పం పిణీలో నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవా రం సాయంత్రం రెండు లారీల యూరియా వచ్చింది. అయితే ఈ విషయమై మన గ్రోమో ర్ వద్ద ఉన్న రైతులకు ముందస్తు సమాచారం కానీ, టోకెన్లు కానీ ఇవ్వకపోవడంతో సోమవారం రాత్రి నుంచి రైతులు షాపుల ఎదుట వర్షంలో తడుస్తూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం వేలాది మంది రైతులు నెమ్మికల్ మన గ్రోమోర్ ఎదుట బారులు తీరారు. వ్యవసాయ అధికారులు పోలీసులు రైతులు స్థానిక పీఏసీఎస్ ఎదుట టోకెన్లు ఇచ్చి అనంతరం ఓక్కో రైతు కు బస్తా యూరియా పంపిణీ చేశారు. టోకెన్లు ఇవ్వడంతో రాత్రి నుంచి వేచి ఉన్న రైతులు తమను కాదని తరువాత వచ్చిన వారికి ఎట్లిస్తరంటూ కొద్దిసేపు మన గ్రోమోర్ కార్యాలయం ఎదుట నెమ్మికల్ దంతాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు కలుగ చేసుకొని అదనంగా టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు.
కట్టంగూర్‌లో బస్తా మూడొందలు..
కట్టంగూర్, సెప్టెంబర్ 23: కట్టంగూర్ పీఏసీఎస్, మన గ్రోమోర్ సెంటర్‌కు రెండు లారీల యూరియా వచ్చింది. దీంతో రైతు వేదిక వద్ద క్యూలో ఉన్న 444 మంది రైతులకు సీరియల్ ప్రకారం టోకెన్లు అందజేశారు. టోకెన్లు తీసుకున్న రైతులు మన గ్రోమోర్తో పాటు సింగిల్ విండో వద్దకు చేరుకొని మళ్లీ అక్కడా క్యూలో నిల్చున్నారు. వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, సీఈవో మల్లారెడ్డి, పోలీసుల పర్యవేక్షణలో ప్రతి రైతుకూ రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. బస్తా రూ.267 గానూ అధికారులు మూడువందలు ఇస్తే తిరిగి మిగతా డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.