కోదాడ, సెప్టెంబర్ 15 : కోదాడ నియోజకవర్గం మోతే మండల పరిధిలోని మావిళ్లగూడెం వద్ద సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారిపై మండలంలోని 10 గ్రామాల రైతులు సోమవారం యూరియా కోసం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నాట్లు వేసి రెండు నెలలు కావస్తున్నప్పటికీ అవసరానికి సరిపడా యూరియా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా చల్లకపోతే పంట దిగుబడి రాదని, అప్పుల పాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లోనూ యూరియా కొరత లేదన్నారు. పాడి బర్రెను కాదని ఒట్టి గొడ్డును తెచ్చుకున్నట్టుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. కుటుంబ సభ్యులమంతా ఇల్లు వదిలిపెట్టి సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
Kodada : సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారిపై రైతుల ధర్నా