– నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
– పోలీసులు, వ్యవసాయ అధికారుల హామీతో ఆందోళన విరమణ
తిప్పర్తి, సెప్టెంబర్ 12 : గత ఆరు రోజులుగా యూరియా కోసం క్యూ కడుతున్నప్పటికీ యూరియా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కట్పల్లి- అద్దంకి హైవేపై ధర్నాకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపులా సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత ఆరు రోజులుగా పనులన్నీ మానుకుని కుటుంబ సభ్యులమందరం యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటల నుండి క్యూ లైన్లలో నిలబడుతున్నప్పటికీ యూరియా మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి నాట్లు వేసి రెండున్నర నెలలు గడుస్తున్నా నేటికీ ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని వాపోయారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే తీరా పంటలకు యూరియా దొరకడం లేదని, ఇలా అయితే పంటలెలా పండుతాయని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ఏనాడు ఇటువంటి సమస్య ఎదురవలేదన్నారు. ముందే యూరియా దొరకదని చెబితే వ్యవసాయం మానుకునే వాళ్లమని, ఇలా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టే వారం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేయడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. రాత్రి ఒంటి గంట నుండి క్యూలో నిలబడినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు సైతం పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. తాసీల్దార్ రామకృష్ణ, వ్యవసాయ అధికారి సన్నీ రాజు, ఎస్ఐ శంకర్ సాయంత్రం వరకు యూరియా వస్తుందని ముందుగా లైన్లో ఉన్నవారికి టోకెన్లు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.