అర్వపల్లి, సెప్టెంబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని రాజకీయ నాయకులతో పాటు రైతులు గొంతెత్తి చెబుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా జాజిరెడ్డిగూడెం మండలంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అర్ధరాత్రి నుండే సొసైటీల ముందు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొరకపోవడంతో నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. సొసైటీలోని డైరెక్టర్లు ఒక్కొక్కరు 10 బస్తాల యూరియా చొప్పున తీసుకుంటున్నారని రైతుల నుండి విమర్శలు వస్తున్నాయి.
తాజాగా శుక్రవారం అర్వపల్లిలోని పీఏసీఎస్ సెంటర్ ముందు జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై రైతులు యూరియా కోసం గంట సాటు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు రహదారిపై భారీగా నిలిచిపోయాయి. నాలుగు రోజుల నుండి ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతుంటే అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్వపల్లి ఎస్ఐ ఈట సైదులు సిబ్బందితో ధర్నా ప్రాంతానికి చేరుకుని అధికారులతో మాట్లాడి యూరియా ఇప్పిస్తానని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు.
Arvapally : జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై రైతుల ధర్నా