అర్వపల్లి, మే 17 : తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో రైతులు శనివారం ధర్నా చేపట్టారు. రెండు నెలలుగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. వీరికి సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. అర్వపల్లి మండలంలో ఇప్పటివరకు 40 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఒక బస్తాకు కేజీ ధాన్యాన్ని తీసేస్తున్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యంతో పాటు, ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వజ్జే శీను, సంపత్ కిరణ్, అశోక్, వెంకటయ్య, శ్రీనివాస్, లింగ మల్లమ్మ, పద్మ, వెంకన్న, చింటూ, మహేశ్ పాల్గొన్నారు.