కాబూల్: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ దవాఖానాను లక్ష్యంగా చేసుకుని మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిని ఆఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో సుమారు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 250 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పవిత్ర రంజాన్ మాసం వేళ పాక్ చేసిన ఈ పనిని పిరికిపంద చర్యగా భారత్ వంటి దేశాలు ఖండించగా ఆఫ్గాన్ క్రికెటర్లు సైతం పాక్ తీరును తూర్పారబట్టారు. ఈ దుర్ఘటనపై ఆ జట్టు పేసర్ నవీన్ ఉల్ హక్ ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్, పాకిస్థాన్ పాలన మధ్య ఎటువంటి తేడా లేదు’ అని రాసుకొచ్చాడు.
ఆ జట్టు మాజీ సారథి రషీద్ ఖాన్ ఎక్స్‌లో.. ఇది యుద్ధ నేరమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘పౌరుల ఇండ్లు, విద్యా సంస్థలు, దవాఖానాలను ఉద్దేశపూర్వకంగా గానీ పొరపాటున గానీ లక్ష్యంగా చేసుకోవడం యుద్ధనేరం. పవిత్ర రంజాన్ మాసంలో సాటి మనుషులపై కనికరం చూపకుండా ఇలాంటి దాడులకు పాల్పడటం బాధాకరం. ఈ ఘోరకృత్యంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని నేను ఐక్యరాజ్యసమితికి, మానవ హక్కుల సంస్థలను విజ్ఞప్తి చేస్తున్నా’ అని భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఆఫ్గాన్ మాజీ సారథి మహ్మద్ నబీ, ఆ దేశ క్రికెట్ బోర్డు సైతం పాక్ దాడిని తీవ్రంగా ఖండించింది.