సూర్యాపేట, మార్చి 26 : సాగు నీళ్లు లేక ఎండిన పంటలకు ఎకరానికి రూ. 30 వేల చొప్పన నష్ట పరిహారం చెల్లించాలని, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజక వర్గాల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు రాక పంటలు ఎండిపోయాయన్నారు. సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు 15 నెలలు అవుతున్న అమలు చేయలేదన్నారు. మహిళలకు చిత బస్సు సౌకర్యం తప్ప ఏ హామీ నెరవేర్చలేదని తెలిపారు. రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, అనేక మంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సైతం రెండు ఎకరాలకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గృహలక్ష్మి, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్‌కార్డులు, ఆసరా పెన్షన్ల పెంపు ఇలా అనేక హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే ప్రజా క్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు సీపీఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమలో సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వెల్పుల వెంకన్న, దండ వెంకట్‌రెడ్డి, నరసింహారావు, శ్రీకాంత్, రవి, శంకర్‌రెడ్డి, రజిత, జ్యోతి పాల్గొన్నారు.