ఆత్మకూర్ ఎస్, మార్చి 24 : అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటినాయక్ తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో వరి పంటకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పకుండా మోసం చేయగా వచ్చే కొద్ది నీటిని రైతులకు అందించడంలో అధికారులు పక్షపాతం వహిస్తున్నట్లు తెలిపారు. వారబంది ప్రకారం గోదావరి జలాలు ఇస్తామని చెప్పిన అధికారులు మెయిన్ కాల్వ నుండి రెండు రోజులు 22ఎల్ కాల్వకు, రెండు రోజులు 36ఎల్ కు, రెండు రోజులు మెయిన్ కాల్వ ద్వారా పెన్‌పహాడ్ వైపు నీళ్లు వదలాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు గేట్లు తీసి నీటిని మళ్లించడంతో మిగతా ప్రాంతాల పంట పొలాలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే సగానికి పైగా వరి పొలాలు ఎండిపోగా మిగతా పొలాలు కోత దశకు వచ్చాయని కనీసం ఆ కొద్ది నీటితో పొలాలు కాపాడాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత నాలుగు రోజులుగా మేల్ కెనాల్‌కు నీళ్లు వెళ్తున్నా, 36 ఎల్ కెనాల్ కు నీళ్లు రాకపోవడంతో ఆ ప్రాంతానికి చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ ఏఈ సురేశ్ వెంటనే క్రేన్ తెప్పించి 36 ఎల్ కాల్వ గేట్లు ఎత్తివేసి మెయిన్ కెనాల్ గేట్లను మూసివేశారు. 36 ఎల్ కాల్వ ఆత్మకూర్ ఎస్ తో పాటు చివ్వేంల మండలంలోని పలు గ్రామాలకు నీళ్లు వెళ్లడంతో రైతులు ఆందోళన విరమించారు.